విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన జిల్లా పంచాయతీ అధికారి
కుంటాల, ఆంధ్రప్రభ: విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.
శనివారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహాన్ని సందర్శించిన ఆయన, మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, భోజనం నాణ్యతపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని అన్నారు. మెనూ ప్రకారం ప్రతిరోజూ భోజనం అందించాలని, నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని సంబంధిత అధికారులను హెచ్చరించారు.
అనంతరం విద్యార్థుల వసతి గదులు, ఆహార నిల్వ గదులను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ఆహార పట్టిక వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో శోభన, పంచాయతీ కార్యదర్శి రాజబాపు, ఆదర్శ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సాయిప్రదతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
