అమరవీరుల త్యాగాలు మరువలేనివి
అమరవీరుల త్యాగాలు మరువలేనివి
తెలంగాణ సాధనలో ఉద్యమకారుల పాత్ర చిరస్మరణీయం: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ: తెలంగాణ సాధన కోసం అమరవీరులు చేసిన త్యాగాలు మరువలేనివని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అమరవీరుల స్తూపం వద్ద ఆయన నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఉద్యమకారులు చేసిన పోరాటం, త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారని విమర్శించారు.
ఎంతోమంది బలిదానాలతో తెలంగాణ సాధించుకున్నారని పేర్కొన్నారు. గతంలో సోనియాను బలిదేవత అన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు తెలంగాణ దేవత అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ కాదని, ఇది హైబ్రిడ్ కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. రెండు కళ్ల సిద్ధాంతంతో అన్ని పార్టీలతో రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని పువ్వాడ ఆరోపించారు. ఒకప్పుడు తెలంగాణ ఏర్పాటును అపహాస్యం చేసిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అమరవీరులకు నివాళులర్పించడం విడ్డూరంగా ఉందన్నారు.
అమరవీరులకు 250 గజాల స్థలం, రూ.10 లక్షలు ఇస్తామని చెప్పి ఇళ్లు కట్టిస్తామన్నారని, కానీ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో నెరవేరలేదని విమర్శించారు. ఖమ్మంలో తెలంగాణ తల్లి విగ్రహం లేకుండా చేయాలని కొందరు భావించారని, దాన్ని అడ్డుకుని తెలంగాణ తల్లి సర్కిల్ ఏర్పాటు చేశామని పువ్వాడ తెలిపారు. జయశంకర్ సార్ విగ్రహం ఏర్పాటు చేసి, దంసలాపురం ఓవర్ బ్రిడ్జ్‌కు ఆయన పేరు పెట్టామని చెప్పారు. అది తెలంగాణ పట్ల తమకున్న నిబద్ధతకు నిదర్శనమన్నారు.
వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను గాంధీభవన్‌కు పంపుతామని పువ్వాడ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో ధూం ధాం కార్యక్రమాల ద్వారా కళాకారులు ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్లు లింగాల కమలరాజు, కూరాకుల నాగభూషణం, ఆర్‌జేసీ కృష్ణ, ఖమర్, పగడాల నాగరాజు, బచ్చు విజయ్ కుమార్, నాయకులు ఉప్పల వెంకట్ రమణ, బొమ్మేర రామ్మూర్తి, డోకుపర్తి సుబ్బారావు, బత్తుల తిరుమలరావు, పగడాల నరేందర్, కృష్ణారావు, రాజ్ కుమార్, మేకల సుగుణరావు, లింగనబోయిన సతీష్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
