సీసీ కెమెరాలు, వీధి దీపాల ఏర్పాటుకు వినతి
ప్రధాన కూడళ్లలో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న తొర్రూరు పట్టణంలో ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పనిచేయని వీధి విద్యుత్ దీపాలను వెంటనే మరమ్మతు చేయాలని కోరుతూ సామాజికవేత్త దొనికెన కుమారస్వామి శనివారం స్థానిక ఎస్సై మహేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వక్కల శ్యాంసుందర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ, వ్యాపారం, ఉద్యోగం, విద్య, వైద్యం తదితర అవసరాల కోసం ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు, వాహనాలు తొర్రూరు పట్టణానికి రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అత్యవసరమని పేర్కొన్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల గుర్తింపు, ప్రమాదాల దర్యాప్తు వంటి అంశాల్లో పోలీసులకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. పట్టణ ప్రధాన రహదారిపై ఉన్న డివైడర్లు పలుచోట్ల దెబ్బతిన్నాయని, సీసీ కెమెరాలు ఉంటే ప్రమాదాల నివారణకు కూడా దోహదపడుతాయని అన్నారు.
అలాగే, మున్సిపాలిటీ పరిధిలో గతంలో డివైడర్లపై ఏర్పాటు చేసిన హైమాస్ట్, వీధి విద్యుత్ దీపాల్లో అనేకం పనిచేయడం లేదని తెలిపారు. ముఖ్యంగా బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంక్ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా వెంటనే విద్యుత్ దీపాలను మరమ్మతు చేసి వెలుగులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
