తల్లి ముర్రుపాలే శిశువుకు తొలి టీకా..

  • ఐసీడీఎస్ సూపర్వైజర్ లీలావతి

రాప్తాడు, ఆంధ్రప్రభ : పుట్టిన శిశువుకు తల్లి ముర్రుపాలే అత్యుత్తమమైన ఆహారం, ఆరోగ్యానికి తొలి రక్షణ అని ఐసీడీఎస్ సూపర్వైజర్ లీలావతి పేర్కొన్నారు. రాప్తాడు మండల కేంద్రంలోని సెక్టార్-1 అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు, బాలింతలు, గ్రామ మహిళలతో కలిసి అవగాహన ర్యాలీ చేపట్టారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో సూపర్వైజర్ లీలావతి మాట్లాడుతూ, శిశువు జన్మించిన గంటలోపే తల్లి ముర్రుపాలు పట్టించాలని సూచించారు. ముర్రుపాలే శిశువుకు తొలి టీకా వంటివని, తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారమని తెలిపారు. ఆరు నెలల వయస్సు వచ్చే వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఇతర పాలు ఇవ్వకూడదని చెప్పారు.

తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లులకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని తెలిపారు. ఆరు నెలల తర్వాత తల్లిపాలతో పాటు అదనపు పోషకాహారాన్ని అందించాలని, అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే బాలామృతం, పాలు, గుడ్లు పిల్లల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు.

ఇంట్లో ఆకుకూరలు, కూరగాయలను ఉడికించి మెత్తగా చేసి పిల్లలకు తినిపించాలని, బయట లభించే జంక్‌ఫుడ్, బిస్కెట్లు, చాక్లెట్లు, కేకులు, శీతల పానీయాలను చిన్నారులకు ఇవ్వకూడదని సూచించారు.

అనంతరం చిరుధాన్యాలు, సెనగలు, నువ్వులు, వేరుసెనగలతో తయారుచేసిన పోషక లడ్డూలను పిల్లలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెక్టార్-2 సూపర్వైజర్ శ్రీవాణి, పాఠశాల ఉపాధ్యాయులు నందిని, సరస్వతి, సంజీవమ్మ, అంగన్‌వాడీ టీచర్లు విజయలక్ష్మి, లక్ష్మీదేవి, సావిత్రి, భారతి, ముత్యాలమ్మ, హెల్పర్ సుశీలతో పాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.