బెల్లంపల్లి బస్టాండ్‌లో బుంగ.. ఎమ్మెల్యే పరిశీలన

ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆర్టీసీ బస్సుల తాత్కాలిక నిలిపివేత

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పడిన బుంగను శనివారం ఎమ్మెల్యే గడ్డం వినోద్, మున్సిపల్ చైర్‌పర్సన్ దావా స్వాతి రమేష్, మందమర్రి జీఎం ఎన్. రాధాకృష్ణ, ఆసిఫాబాద్ డిపో మేనేజర్ రాజశేఖర్‌తో కలిసి పరిశీలించారు.

బుంగను అన్ని కోణాల్లో పరిశీలించిన ఎమ్మెల్యే, వెంటనే పూడ్చివేసేలా సింగరేణి అధికారులను ఆదేశించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సుల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

బస్టాండ్ వెలుపల నుంచి బస్సులు ఆగేలా తక్షణ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిపో మేనేజర్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చింతల వసంత, నిచ్చకోల వంశీకృష్ణ, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు బండి ప్రభాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

బుంగ ఏర్పడిన విషయాన్ని ఎమ్మెల్యే తెలియజేయడంతో మందమర్రి జీఎం ఎన్. రాధాకృష్ణ వెంటనే స్పందించారు. సివిల్ విభాగం సిబ్బందితో కలిసి జేసీబీ ద్వారా బుంగలో మట్టిని నింపించి పూడ్చివేసే పనులు చేపట్టించారు.

ఈ సందర్భంగా జీఎం రాధాకృష్ణ మాట్లాడుతూ, బుంగ ఏర్పడిన అంశంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బస్టాండ్ ప్రాంతంలో బ్రిటిష్ కాలంలో భూగర్భ గనులు నడిచాయని, వర్షపు నీరు బస్టాండ్ గోడ పక్కనున్న గుంతలోకి చేరడంతో భూమి కుంగిపోయి బుంగ ఏర్పడిందని వివరించారు. ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు.

ఇదిలా ఉండగా, బెల్లంపల్లి ఆర్టీసీ బస్టాండ్‌ను కన్నాలబస్తి నుంచి కాంటా చౌరస్తా సమీపంలోని పాత సీఎస్‌పీ గడ్డకు తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బస్సు డిపో ఏర్పాటుకు 31 ఏళ్ల క్రితమే బస్టాండ్ సమీపంలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారని, అక్కడే బస్సు డిపో ఏర్పాటు చేసి బస్టాండ్‌ను తరలించాలని ప్రజలు కోరుతున్నారు.