రాష్ట్ర అవతరణ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

రాష్ట్ర అవతరణ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

భూపాలపల్లి, ఆంధ్రప్రభ:
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మినిట్ టు మినిట్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరవుతారని కలెక్టర్ తెలిపారు. మంగళవారం ఉదయం 7.25 గంటలకు కేటీపీపీ చెల్పూర్‌లోని గోదావరి విశ్రాంతి భవనం నుంచి ముఖ్య అతిథి బయలుదేరుతారని చెప్పారు.

జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరులకు పుష్పాంజలి ఘటించిన అనంతరం, ఐడీఓసీ కార్యాలయానికి చేరుకుంటారని తెలిపారు. అక్కడ గౌరవ వందనం స్వీకరించిన తర్వాత జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. అనంతరం జాతీయ గీతం, తెలంగాణ గీతం ఆలాపనలో పాల్గొని, జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. రాష్ట్ర సాధనలో అమరులైన వారి కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా సత్కరిస్తారని వివరించారు.

కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించిన తర్వాత హైటీ కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది ఉదయం 7.30 గంటల వరకు ఐడీఓసీ కార్యాలయానికి చేరుకోవాలని రాహుల్ శర్మ స్పష్టం చేశారు.

Leave a Reply