విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 8 వరకు అమెరికా, యూకే సహా పలు దేశాల్లో పర్యటన
పారిశ్రామిక దిగ్గజాలు, గ్లోబల్ ఇన్వెస్టర్లతో భేటీలు..
సెప్టెంబరు మూడో వారంలో అసెంబ్లీ సమావేశాల అవకాశం

హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణకు భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 8 వరకు దాదాపు 20 రోజులపాటు అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)తో పాటు మరికొన్ని కీలక దేశాల్లో ఆయన పర్యటించే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. కంపెనీల ప్రతినిధుల అపాయింట్‌మెంట్లను బట్టి తుది షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ పర్యటనలో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ పెట్టుబడి సంస్థలు, ప్రవాస భారతీయులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ముఖ్యంగా ఐటీ, కృత్రిమ మేధ (ఏఐ), డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, రక్షణ తయారీ వంటి వ్యూహాత్మక రంగాల్లో పెట్టుబడులను తెలంగాణకు రప్పించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు.

అమెరికా పర్యటనలో చిప్ తయారీ, క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అలాగే లండన్‌లో గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్వెస్టర్లు, విద్యాసంస్థల ప్రతినిధులతో చర్చలు నిర్వహించే అవకాశముందని సమాచారం.

గత విదేశీ పర్యటనల్లో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల (ఎంఓయూలు) అమలు పురోగతిని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమీక్షించే అవకాశముంది. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన లేదా ఆసక్తి చూపుతున్న అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతోనూ ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబరు మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు

మరోవైపు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబరు మూడో వారంలో వారం రోజులపాటు నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చట్టసభల్లో పోటీ చేసే కనీస వయోపరిమితిని 25 నుంచి 21 సంవత్సరాలకు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయనున్నట్లు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ అంశంపై ఆగస్టు మధ్యలో ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశాలపైనా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

విదేశీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి సెప్టెంబరు రెండో వారంలో రాష్ట్రానికి చేరుకోనున్న నేపథ్యంలో, అనంతరం అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.