ఇందిరమ్మ ఇంటి మెట్ల తొలగింపుపై వివాదం

ఫిర్యాదు మేరకే చర్యలు తీసుకున్నామని కమిషనర్ వివరణ

భూత్పూర్, ఆంధ్రప్రభ: భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి ముందు మురికి కాలువపై నిర్మించిన మెట్లను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది వెళ్లడంతో వివాదం నెలకొంది.

అమిస్తాపూర్ 8వ వార్డుకు చెందిన నిరుపేద మహిళ పట్నం చెన్నమ్మకు ప్రభుత్వం ఏడాది క్రితం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. అప్పులు చేసి, కష్టపడి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసిన ఆమె గృహప్రవేశానికి సిద్ధమవుతున్న సమయంలో మున్సిపల్ అధికారులు ఇంటి ముందు మురికి కాలువపై నిర్మించిన మెట్లను తొలగించాలని రావడంతో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

ఇంటి నిర్మాణం పూర్తై గృహప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో అధికారులు చర్యలు చేపట్టడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాలువల ఆక్రమణలను తొలగించడం అవసరమేనని, అయితే గ్రామంలో రోడ్లను ఆక్రమించి నిర్మించిన ఇళ్లు, ఇతర నిర్మాణాలపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించారు.

నిబంధనలు అందరికీ సమానంగా అమలు కావాలని, సామాన్యులపై మాత్రమే చర్యలు తీసుకుని బలవంతుల ఆక్రమణలను వదిలేయడం సరైన విధానం కాదని స్థానికులు అభిప్రాయపడ్డారు. చిన్న నిర్మాణాలపై హడావుడిగా చర్యలు తీసుకుంటున్న అధికారులు, రోడ్లను ఆక్రమించి నిర్మించిన ఇళ్లు, ఇతర అక్రమ నిర్మాణాల విషయంలో ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

గ్రామంలోని అన్ని ఆక్రమణలను గుర్తించి వివక్ష లేకుండా ఒకే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.

మరోవైపు, అమిస్తాపూర్‌లో ఇంటి ముందు మురికి కాలువపై మెట్లు నిర్మించారంటూ ఫిర్యాదు అందడంతో మున్సిపల్ సిబ్బందిని పరిశీలనకు పంపినట్లు మున్సిపల్ కమిషనర్ పవన్ తెలిపారు. ప్రజల నుంచి ఎక్కడైనా ఫిర్యాదులు అందితే వాటిని పరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, మున్సిపాలిటీ పరిధిలోని అన్ని అనధికార ఆక్రమణలపై దశలవారీగా చర్యలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.