స్వర్ణం సాధించడం దేశానికి గర్వకారణం : టీపీసీసీ అధ్యక్షుడు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: కామన్వెల్త్ క్రీడల్లో మహిళల 48 కిలోల జూడో విభాగంలో భారత క్రీడాకారిణి అస్మితా దే స్వర్ణ పతకం సాధించడం దేశానికి గర్వకారణమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, కామన్వెల్త్ క్రీడల్లో జూడో విభాగంలో భారతదేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించి అస్మితా దే చరిత్ర సృష్టించారని కొనియాడారు. అత్యున్నత అంతర్జాతీయ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
కఠోర శ్రమ, అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదలతో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని అస్మితా దే తన విజయంతో మరోసారి నిరూపించారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆమె సాధించిన విజయం దేశ యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని భారతదేశానికి మరిన్ని పతకాలు సాధించి దేశ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలని ఆయన ఆకాంక్షించారు.
