కార్పొరేట్ పాలనకు కంపెనీ సెక్రటరీలే కీలకం: శ్రీధర్ బాబు

హైదరాబాద్, ఆంధ్రప్రభ: కార్పొరేట్ పాలనను బలోపేతం చేయడంలో, పారదర్శకతను పెంపొందించడంలో, నిబంధనల అమలును నిర్ధారించడంలో, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడంలో కంపెనీ సెక్రటరీల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర సమాచార సాంకేతిక, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్‌లోని కొండాపూర్ తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్‌లో ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 50వ దక్షిణ భారత ప్రాంతీయ కంపెనీ సెక్రటరీల సదస్సు–2026ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.

ఈ సందర్భంగా దక్షిణ భారత రాష్ట్రాల నుంచి హాజరైన 700 మందికిపైగా కంపెనీ సెక్రటరీలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. కార్పొరేట్ రంగంలో సుస్థిర అభివృద్ధికి, పారదర్శక పాలనకు, పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంపొందించేందుకు కంపెనీ సెక్రటరీలు చేస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం పారదర్శకత, జవాబుదారీతనం, పెట్టుబడిదారులకు అనుకూలమైన వ్యాపార వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. సుస్థిర ఆర్థికాభివృద్ధిని సాధించడంతో పాటు రాష్ట్రానికి మరిన్ని దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. సదస్సులో పాల్గొన్న ప్రతినిధులందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి, ఈ సమావేశం విజ్ఞానాన్ని పెంపొందించే, అనుభవాలను పంచుకునే, వృత్తిపరంగా మరింత అభివృద్ధికి దోహదపడే వేదికగా నిలవాలని ఆకాంక్షించారు.