గోదావరి వరద ప్రభావిత గ్రామాల్లో జిల్లా ఎస్పీ ప్రతాప్ పర్యటన..
వేలేరుపాడు, ఆంధ్రప్రభ : గోదావరి నదికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో ముంపునకు గురైన వేలేరుపాడు మండలంలోని గ్రామాల్లో ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ శనివారం విస్తృతంగా పర్యటించారు. స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు, పోలీసు సిబ్బందితో కలిసి నాటు పడవల ద్వారా లోతట్టు ప్రాంతాలకు చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.
రేపాకగుమ్ము, రుద్రమకోట, తాటికూరుగుమ్ము, కన్నయ్యగుంట, గొల్లపల్లి గ్రామాల్లో పర్యటించిన ఎస్పీ, వరదలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు.

పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించి వారికి అవసరమైన సహాయం అందేలా అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గత వరదల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ స్వచ్ఛందంగా పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు గస్తీ ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రిస్తున్నామని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు పోలీసు బృందాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు, సమాచారం అందిస్తూ సహాయక చర్యలను నిరంతరం కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ పర్యటనలో పోలవరం డీఎస్పీ జైకృష్ణ, కుక్కునూరు ఇన్‌స్పెక్టర్ బాల సురేష్‌బాబు, వేలేరుపాడు ఎస్‌ఐ నవీన్‌కుమార్, స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
