మృగశిర కార్తె ఎఫెక్ట్.. చేపలకు భలే డిమాండ్
మృగశిర కార్తె ఎఫెక్ట్.. చేపలకు భలే డిమాండ్
మోత్కూర్, (ఆంధ్రప్రభ): మృగశిర కార్తె ప్రారంభం కానున్న నేపథ్యంలో చేపలకు భారీ డిమాండ్ ఏర్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ఆదివారం ఉదయం నుంచే ప్రజలు పెద్దఎత్తున చేపలు కొనుగోలు చేస్తున్నారు.
సోమవారం మృగశిర కార్తె ప్రారంభం కావడంతో ఈ రోజే చేపల కూర వండి తినేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సాధారణంగా కిలో రూ.150కు విక్రయించే చేపల ధర ప్రస్తుతం రూ.200కు చేరింది. డిమాండ్ మరింత పెరగడంతో సోమవారం కిలో చేపలను రూ.250 చొప్పున విక్రయించే అవకాశం ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
మృగశిర కార్తె ప్రారంభమైన రోజున చేపలు తింటే దమ్ము, ఆయాసం వంటి సమస్యలు తగ్గి ఆరోగ్యంగా ఉంటారనే నమ్మకం ప్రజల్లో ఉంది. దీంతో ప్రతి ఏడాది ఈ సమయంలో చేపల విక్రయాలు గణనీయంగా పెరుగుతుంటాయి.
అలాగే మృగశిర కార్తె రోజున రాత్రి భోజనం అనంతరం పాలింగం తీసుకోవడం స్థానిక ఆనవాయితీ. అల్లం, ఎల్లిపాయ, బెల్లంతో ఘాటుగా తయారు చేసే ఈ పాలింగం తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని పెద్దలు చెబుతున్నారు.
