ఎల్‌నినోపై కిసాన్ కాంగ్రెస్ ఆందోళన
- రైతులకు ఉచిత పంట బీమా అమలు చేయాలి
- ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం.. ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వాలి
- యూరియా, డీఏపీ కొరత లేకుండా ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలని తీర్మానం
- టమాటా, పొగాకు, బొప్పాయి, ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
- రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో పలు కీలక తీర్మానాలు
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో గురువారం రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకరరావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వ్యవసాయ సంక్షోభం, రైతుల సమస్యలు, పంటల పరిస్థితిపై విస్తృతంగా చర్చించి పలు కీలక తీర్మానాలు ఆమోదించారు.
సమావేశంలో కామన ప్రభాకరరావు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొని వ్యవసాయ రంగానికి తీవ్ర ముప్పు ఏర్పడిందన్నారు. వరి, పత్తి వంటి ప్రధాన పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని, ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో వ్యవహరించకపోతే కొన్ని ప్రాంతాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కంది, మినుములు, చిరుధాన్యాలు వంటి తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, సహజ వ్యవసాయం, సేంద్రియ సాగుకు ఇన్పుట్ సబ్సిడీలు అందించడంతో పాటు ప్రత్యామ్నాయ విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయాలని తీర్మానించారు.
అలాగే రాష్ట్రంలోని రైతులందరికీ ఉచిత పంటల బీమా అమలు చేసి ప్రీమియాన్ని ప్రభుత్వమే భరించాలని సమావేశం కోరింది. రాష్ట్రంలో యూరియా, డీఏపీ వంటి ఎరువుల కొరత తలెత్తకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా అవసరమైన మేర సరఫరా చేయాలని, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో పశుగ్రాసాన్ని ఉచితంగా అందించడంతో పాటు సాగునీటి నిర్వహణను మెరుగుపరచాలని సమావేశం డిమాండ్ చేసింది. పొగాకు రైతులకు కిలోకు రూ.300 చొప్పున కొనుగోలు ధర కల్పించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.1,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి అన్ని రకాల పొగాకును కొనుగోలు చేయాలని తీర్మానించింది.
టమాటా రైతులకు కిలోకు రూ.30 మద్దతు ధర కల్పించడంతో పాటు కోల్డ్ స్టోరేజీలు, విలువ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. బొప్పాయి రైతులకు కిలోకు రూ.10 గిట్టుబాటు ధర కల్పించి ధరల స్థిరీకరణ కోసం రూ.5,000 కోట్ల నిధి ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేసింది. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందించాలని, 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.300 కనీస మద్దతు ధర నిర్ణయించాలని, సీడ్ ధరలను తగ్గించాలని సమావేశం కోరింది. రాష్ట్రవ్యాప్తంగా డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాలని, నక్కపల్లి మండలంలో భూసేకరణను 2013 భూసేకరణ చట్టం ప్రకారం అమలు చేయాలని తీర్మానించింది.
ఈ సందర్భంగా ఇటీవల దేశ రాజధానిలో విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సమావేశం అభినందించింది. సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు, అడ్మిన్ ఇన్‌ఛార్జి కొలనుకొండ శివాజీ ముఖ్య అతిథిగా పాల్గొని రైతు సమస్యలపై కిసాన్ కాంగ్రెస్ మరింత చురుకుగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ నాయకత్వం రైతుల కోసం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్లు, వివిధ జిల్లాల చైర్మన్లు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
