కంటికి గంతలు కట్టుకుని విమర్శలు చేయడం సరికాదు
కాంగ్రెస్ నాయకులు
బెల్లంపల్లి అభివృద్ధికి రూ. 556 కోట్ల నిధులు తెచ్చిన ఎమ్మెల్యే వినోద్‌కు ప్రజల మద్దతు ఉందని వ్యాఖ్య
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామిపై మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.
గురువారం బెల్లంపల్లి కాంగ్రెస్ పట్టణ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు బండి ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వాతి రమేష్‌బాబు, మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు, టీపీసీసీ సభ్యుడు చిలుముల శంకర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బెల్లంపల్లి అభివృద్ధికి పెద్దగా కృషి చేయని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ప్రస్తుతం అధికారంలో లేకపోవడంతో విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 32 నెలల్లోనే ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి నియోజకవర్గ అభివృద్ధికి రూ.556.05 కోట్ల నిధులు మంజూరు చేయించారని తెలిపారు. వివిధ అభివృద్ధి పనులతో నియోజకవర్గాన్ని పురోగతి దిశగా తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.
నియోజకవర్గానికి మరిన్ని నిధులు తీసుకురావడం కోసం ఎమ్మెల్యే హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తుంటే, దానిని కూడా రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం తగదన్నారు.
అంబేద్కర్ చౌరస్తా కూరగాయల మార్కెట్ వద్ద తాము చేపట్టిన అభివృద్ధి పనులను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని, మాజీ ఎమ్మెల్యే తన పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని అధికారిక ఆధారాలతో చూపించాలని సవాల్ విసిరారు.
మాజీ ఎమ్మెల్యే పాలనలో జరిగిన పలు అంశాలను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు గతాన్ని మర్చిపోలేదని, వాస్తవాలను గుర్తుంచుకున్నారని పేర్కొన్నారు. కాకా గడ్డం వెంకటస్వామి తెలంగాణ ఉద్యమంలో చేసిన సేవలను గుర్తు చేస్తూ, చరిత్రను వక్రీకరించి మాట్లాడవద్దని హెచ్చరించారు.
ఈ సమావేశంలో బెల్లంపల్లి పట్టణంలోని 34 వార్డుల కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
