కాకినాడ కింగ్స్ గ్రాండ్ విక్టరీ
కాకినాడ కింగ్స్ గ్రాండ్ విక్టరీ
సింహాద్రి వైజాగ్ లయన్స్‌పై 72 పరుగుల తేడాతో ఘన విజయం
విశాఖపట్నం, ఆంధ్రప్రభ: విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఏపీఎల్ సీజన్-5 ప్రారంభమైంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా టోర్నీని ప్రారంభించారు. ముందుగా ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు రెండు జట్లకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టాస్ కార్యక్రమంలో పాల్గొని జట్లకు అభినందనలు తెలిపారు. టాస్ గెలిచిన సింహాద్రి వైజాగ్ లయన్స్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన కాకినాడ కింగ్స్ జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. అభిషేక్, అర్జున్ మంచి ఆరంభం ఇవ్వగా, అనంతరం క్రీజులోకి వచ్చిన తపస్వి, మనీష్ ఆ జోరును కొనసాగించారు. మూడు వికెట్లు పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన యువన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రెండు ఫోర్లు, ఆరు సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. చివర్లో వికెట్ కీపర్ లేకాజ్ రెడ్డి ఏడు బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో పవర్ హిట్టింగ్ చేయడంతో కాకినాడ కింగ్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు చేసింది.
సింహాద్రి వైజాగ్ లయన్స్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఆ జట్టు తరఫున గిరినాథ్ రెడ్డి, ఢిల్లీ గణేష్, వినయ్ కుమార్, త్రిపురాన విజయ్ తలో వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టు ఆరంభంలో కొంత దూకుడు చూపించింది. తొలి వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యం నమోదైనా, ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో జట్టు కష్టాల్లో పడింది. 10 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 85 పరుగులు మాత్రమే చేసింది.
కెప్టెన్ రికీ భుయ్ 32 పరుగులు, త్రిపురాన విజయ్ 33 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లలేకపోయారు. కాకినాడ కింగ్స్ బౌలర్లు విరామం లేకుండా వికెట్లు పడగొడుతూ వైజాగ్ లయన్స్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో సింహాద్రి వైజాగ్ లయన్స్ 18.4 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది.
కాకినాడ కింగ్స్ బౌలర్ ఆంజనేయులు మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో అర్ధ శతకంతో మెరిసిన యువన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ విజయంతో కాకినాడ కింగ్స్ ఏపీఎల్ సీజన్-5ను ఘనంగా ప్రారంభించింది.
