ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలపై.. నిఘా ఏదీ..!

  • యథేచ్చగా నిషేదిత వస్తువుల రవాణా

నెల్లూరు నగరంలోని బీఎంపీస్‌ పార్శిల్‌ సర్వీసుపై తాజాగా విజిలెన్స్‌ అధికారులు జరిపిన డాడుల్లో దాదాపు రూ.20 లక్షల విలువైన బిల్లులు సక్రమంగా లేని సిగరెట్‌లు, పాన్‌ మసాలా ఉత్పత్తులు పట్టుబడ్డాయి. సమాచారం ఎవరో అందిస్తే దాడులు జరిపితేనే లక్షల విలువైన ఉత్పత్తులు పట్టుబడ్డాయంటే ఇక రహస్యంగా దొంగ బిల్లులతో ఇంకెన్ని, ఏమేమి అక్రమ రవాణా అవుతున్నాయో అర్థం కాకుండా ఉంది. తనిఖీలు లేకపోవడం, రవాణా కంపెనీలు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతుండడంతో ఈ అక్రమ దందా మూడు ప్యాకెట్లు.. ఆర్‌ పార్శిళ్ళుగా గుట్టుచప్పుడు కాకుండా జరిగి పోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వానికి భారీగా గండి పడుతుంది. పోలీస్‌, విజిలెన్స్‌, జీఎస్టీ, రవాణా అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తే జిల్లాలో అక్రమ వ్యాపారానికి చెక్‌ పెట్టే అవకాశం ఉంటుంది.

నెల్లూరు, ప్రతినిధి (ఆంధ్రప్రభ) : నెల్లూరు జిల్లాకు ప్రధాన కేంద్రం నెల్లూరు నగరం కాగా.. కావలి పట్టణ స్థాయిని దాటి నగర స్థాయికి పరుగులు తీస్తోంది. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం, కందుకూరు మున్సిపాలిటీలతో పాటు కోవూరు, వింజమూరు, ఉదయగిరి, పొదలకూరు వంటి మండల కేంద్రాలు కూడా పట్టణ స్థాయిని చేరుకున్నాయి.

ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రకరకాల అవసరాలు ఉంటాయి. నిత్యావసరాల నుంచి ప్రతిఒక్క వాణిజ్య వస్తువు కూడా ప్రజలకు అవసరమైనవే. వీటన్నింటినీ రవాణా చేసేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్టీసీ సంస్థ చాలదు. దీంతో ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రైవేటు రంగంలో ఎన్నో సంస్థలు ఏర్పడ్డాయి.

శ్రీ రామదాసు మోటార్‌ ట్రాన్స్‌పోర్టు, నవతా, భారత్‌ వంటివి ఎప్పటి నుంచో సేవలు అందిస్తుండగా ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎల్‌ సర్వీసులు గతంలో, ప్రస్తుతం ఆర్టీసీనే సొంతంగా పార్శిల్‌ సర్వీసులు నిర్వహిస్తోంది.

ఇటీవల కాలంలో వీఆర్‌ఎల్‌, సింధు, ఎస్‌డీఎల్‌ఎస్‌, నేషనల్‌, బీఎంపీఎస్‌, డీబీఆర్‌, సాయిరాం, వరలక్ష్మి, కోటి రోడ్‌ లైన్స్‌ వంటి సంస్థలు కూడా పార్శిల్‌ సర్వీసులను నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఆయా పార్శిల్‌ల సర్వీసుల ద్వారా ప్రజలు తమకు అవసరమైన వాటిని ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకోవడం, ఇక్కడి నుంచి అక్కడికి పంపించడం జరుగుతోంది.

ఆయా ట్రాన్స్‌పోర్టులలో ముఖ్యంగా పురుగు మందులు, నిత్యావసర సరుకులతో పాటు కొంత బరువు ఉన్న ప్రతి ఒక్కటి ట్రాన్స్‌పోర్టు చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ అంటే సెల్‌ఫోన్‌లు, కంప్యూటర్లు వంటివి కూడా పార్శిల్‌ సర్వీసుల ద్వారా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎగుమతులు, దిగుమతులు జరుగుతుంటాయి.

ఆయా ట్రాన్స్‌పోర్టులు అంతర్‌ జిల్లాల సర్వీసులు మాత్రమే కాకుండా అంతర్రాష్ట సర్వీసులు కూడా నిర్వహిస్తున్నారు. అంటే జిల్లా కేంద్రం నుంచి బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌లకు కూడా నెల్లూరు నుంచి, నెల్లూరు మీదుగా కూడా ట్రాన్స్‌పోర్టు సర్వీసులు నడుస్తున్నాయి.

పంపించేవారిపైనే బాధ్యత..

ఆయా ట్రాన్స్‌పోర్టు సర్వీసుల్లో ఎగుమతి, దిగుమతి అయ్యే వస్తువులు చక్కగా ప్యాకింగ్‌ చేసి రవాణా చేయడం జరుగుతుంది. అందులో ఏ వస్తువు ఉన్నది కూడా ట్రాన్స్‌పోర్టు ఉద్యోగులకు అవగాహన ఉండదు. కేవలం ఎగుమతిదారు ఇచ్చే ఇన్‌ వాయిస్‌ ఆధారంగానే వారు రవాణా చేస్తారు.

అంటే లోపల ఏ వస్తువు ఉన్నది వారికి సంబంధం లేదు. వారు ఎగుమతి బిల్లు ఆధారంగానే రవాణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. గతంలో ఇటు ఎగుమతిదారులు, అటు దిగుమతిదారులు కూడా పూర్తి స్థాయిలో అడ్రసు నింపాల్సి వచ్చేది. అయితే ఇటీవల కాలంలో ఆ సాంప్రదాయానికి స్వస్తి చెప్పేశారు.

కేవలం పేరు, ఫోన్‌ నెంబర్‌ ఉంటే చాలు ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి ఎగుమతి అయిపోతున్నాయి.. ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి దిగుమతి అయిపోతున్నాయి. తమ వద్దకు సరుకు రాగానే ట్రాన్స్‌పోర్టు కంపెనీ ఉద్యోగులు సంబంధిత వ్యక్తికి ఫోన్‌ చేయడం, మీ పార్శిల్‌ వచ్చి ఉందని చెప్పడం, వారు వచ్చి నిర్ణీత మొత్తం చెల్లించి ఎల్‌ఆర్‌ కాపీ చూపించి తీసుకెళ్లడం జరుగుతోంది.

పట్టుబడ్డ సిగిరెట్లు, పాన్‌ మసాలాలు

కాగా.. బుధవారం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు అందిన సమాచారం మేరకు నగరంలోని బీఎంపీఎస్‌ పార్శిల్‌ సర్వీసుపై దాడులు చేశారు. ఆయా దాడుల్లో దాదాపు రూ.20 లక్షలు విలువైన సిగిరెట్లు, పాన్‌ మసాలాలు దొరికాయి. వీటన్నింటికీ సక్రమంగా బిల్లులు లేకపోవడం గమనార్హం.

ట్రాన్స్‌పోర్టు సర్వీసు వారిని విజిలెన్స్‌ అధికారులు చిరునామా అడిగితే కేవలం ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా రవాణా చేస్తున్నట్లు తెలియజేయడంతో అవాక్కయ్యారు. ప్రస్తుత రోజుల్లో సెల్‌ఫోన్‌కు సంబంధించి సిమ్‌ అనేది ఇతరుల పేరుతో కూడా సులువుగా దొరుకుతోంది.

ఈ నేపధ్యంలో అక్రమ రవాణా చేసే వారు సరైన పేరు, సరైన ఫోన్‌ నెంబర్‌ ఇస్తారని అనుకోలేము. ఒక్క సిగిరెట్ల విషయంలోనే ఇలా రూ.20 లక్షలు సరుకు అక్రమంగా బిల్లులు లేకుండా రవాణా అవుతుందంటే అది కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన ట్రాన్స్‌పోర్టు కంపెనీల ద్వారా అవుతుందంటే ఆందోళన చెందాల్సిన అవసరం ఉన్నట్టే కదా.. ఈ విషయంలో బిల్లులు లేని సరుకులు రవాణా చేస్తున్న ట్రాన్స్‌పోర్టు కంపెనీలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం గర్హనీయంగా ఉంది.

పొంచి ఉన్న పేలుడు పదార్ధాల ముప్పు

దేశంలో, రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద తీవ్రవాద కదలికలు అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల ఢిల్లిలో జరిగిన పేలుళ్లలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు తీవ్రవాదులు పేలుడు పదార్ధాలను వినియోగించి ఎన్నో సార్లు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు.

సిగిరెట్లు, పాన్‌మసాలాలు బిల్లులు లేకుండా బాధ్యతారాహిత్యంగా తరలిస్తున్న ట్రాన్స్‌పోర్టు కంపెనీలు ఇటువంటి పేలుడు పదార్ధాలను కూడా ఇతర పదార్ధాల పేరుతో ఎగుమతి చేస్తే పైన బిల్లు చూసి ఓకే చెప్పుకుంటూ యధేచ్ఛగా రవాణా చేసేస్తాయి. అదేవిధంగా యువతను నిర్వీర్యం చేస్తున్న గంజాయి, మాదక ద్రవ్యాలు ఇతర పేర్లతో నిరాటంకంగా రవాణా అయిపోతుంటాయి.

జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత బాధ్యులను పట్టుకుంటే ఎంత.. పట్టుకోకపోతే ఎంత.. ఈ విషయంలో అటు పోలీసులు, ఇటు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో పాటు కమర్షియల్‌ ట్యాక్స్‌, జీఎస్టీ అధికారులు కూడా తనిఖీలు నిర్వహించకపోవడం అక్రమ రవాణాదారులకు కలిసి వస్తోంది.

దీంతో వారు ఎటువంటి బిల్లులు లేకుండానే యధేచ్ఛగా రకరకాల వస్తువులు, నిషేదిత వస్తువులను కూడా అక్రమంగా ఈ ట్రాన్స్‌పోర్టు కంపెనీల ద్వారా రవాణా చేస్తున్నట్లు అనుమానం వస్తోంది. ఈ వ్యవహారంలో ఇతర రాష్ట్రాల నుంచి జీఎస్టీ చెల్లించకుండా అనధికారిక ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌తో పాటు ఇతర వస్తువులు కూడా ఎగుమతి, దిగుమతి అవుతున్నట్లు సమాచారం. దీంతో జీఎస్టీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతున్నట్లే కదా..

సమన్వయంతో తనిఖీలు నిర్వహించాలి

ఈ విషయంలో పోలీసు శాఖ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, నార్కొటిక్స్‌ డిపార్ట్‌ మెంట్స్‌తో పాటు జీఎస్టీ అధికారులు కూడా సమన్వయమై ట్రాన్స్‌పోర్టు కంపెనీల ద్వారా రవాణా అయ్యే ఉత్పత్తులను పూర్తి స్థాయిలో తనిఖీ చేయలేకపోయినప్పటికీ ర్యాండమ్‌గా, పీరియాడికల్‌గా తనిఖీలు చేసినా కూడా ఎన్నో భయంకర వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.

తనిఖీలు ముమ్మరంగా జరుగుతుంటే.. ట్రాన్స్‌పోర్టు కంపెనీలు కూడా బాధ్యతగా వ్యవహరిస్తాయి. అక్రమ రవాణాదారులకు అడ్డుకట్ట పడుతుంది. పేలుడు పదార్ధాలు, మాదక ద్రవ్యాల ముప్పు తగ్గుతుంది. అలాగే అక్రమంగా రవాణా కాకపోతే జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి కూడా ఎంతో ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ఈ విషయమై తగు ఆలోచన చేసి పై శాఖల వారికి సరైన మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉంది.

Leave a Reply