కటక్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్ధేశించిన భారీ టార్గెట్ ను 44.3 ఓవర్లలో చేదించిన భారత జట్టు.. 2-0తో సిరీస్ ను సొంతం చేసుకుంది.
కాగా, 305 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బ్యాటర్లు అద్బుత ప్రదర్శన కనబర్చారు. ఓపెనర్ శుభమన్ గిల్ (60) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (119) సెంచరీతో విజృంభించాడు. అయితే విరాట్ కోహ్లీ (5) మరోసారి నిరాశపరిచాడు.
ఇక తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ లోనూ రాణించారు. శ్రేయాస్ అయ్యర్ (44), అక్షర్ పటేల్ (41 నాటౌట్) పరుగులు చేశారు. రోహిత్ ఔటైన తర్వాత వీరిద్దరూ కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడుతూ అవసరమైన పరుగులు రాబట్టారు.
ఆఖర్లో కేఎల్ రాహుల్ (10), హార్దిక్ పాండ్యా (10), రవీంద్ర జడేజా (11 నాటౌట్) పరుగులు చేశారు. దీంతో ఇంగ్లండ్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. కాగా, సిరీస్‌లో ఆఖరి మూడో మ్యాచ్ ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో వేదికగా జరగనుంది.