జొన్నగిరి గోల్డ్ మైన్స్‌పై సీఎం ప్రత్యేక దృష్టి
జొన్నగిరి గోల్డ్ మైన్స్‌పై సీఎం ప్రత్యేక దృష్టి
జూన్ 24న సీఎం పర్యటన.. అధికార యంత్రాంగం అప్రమత్తం
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 24న కర్నూలు జిల్లాలో చేపట్టనున్న పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన జిల్లాకు ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమమని, ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ విస్తృతంగా చర్చించారు. ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్, భద్రతా ఏర్పాట్లు, ప్రజాసభ నిర్వహణ, మౌలిక వసతుల కల్పన, పారిశుధ్య చర్యలు, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి తొలుత హెలికాప్టర్ ద్వారా జిల్లాకు చేరుకుని జొన్నగిరిలోని జియో మైసూర్ గోల్డ్ మైన్స్‌ను సందర్శిస్తారని తెలిపారు. గోల్డ్ మైన్స్‌లో భూమిపూజ కార్యక్రమంతో పాటు బంగారం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, గనుల ప్లాంట్‌ను పరిశీలించనున్నట్లు చెప్పారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని వివరించారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ ఏర్పాట్లను అత్యున్నత ప్రమాణాలతో పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు రహదారుల మరమ్మతులు, బారికేడింగ్, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు.
ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రత్యేక ఆహ్వానితులు సౌకర్యవంతంగా కార్యక్రమంలో పాల్గొనేలా అన్ని ఏర్పాట్లు ఉండాలని పేర్కొన్నారు. సభా ప్రాంగణంలో తాగునీటి వసతి, నిరంతర విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సదుపాయం, పారిశుధ్య చర్యలు, లైటింగ్, సౌండ్ సిస్టమ్, ఎల్‌ఈడీ స్క్రీన్లు, మొబైల్ టాయిలెట్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.
భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసేలా ప్రత్యేక ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.
పీఎండీఎస్, డ్రిప్ ఇరిగేషన్, జలధార–జలహారతి, స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర, డీఆర్‌డీఏ, స్కిల్ డెవలప్మెంట్ తదితర కార్యక్రమాల ద్వారా సాధించిన విజయాలను ప్రదర్శించేలా శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా వీవీఐపీలు, వీఐపీలు, ప్రజాప్రతినిధులు, అధికారుల కోసం ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని పోలీసు శాఖ అధికారులకు ఆదేశించారు.
ప్రజాసభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజన వసతులు, తాగునీటి సదుపాయాలు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
జిల్లాలో జరుగనున్న ఈ పర్యటన ద్వారా జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టుకు రాష్ట్ర స్థాయిలో మరింత ప్రాధాన్యత లభించనుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ మరోసారి అధికారులకు సూచించారు.
సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, పత్తికొండ ఆర్డీవో ఓబులేసు, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, ఆదోని ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ మధుసూదన్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
