Nandyala | సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు..
అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆకస్మిక తనిఖులు
రికార్డుల పరిశీలన.. సిబ్బందిని ప్రశ్నించిన అధికారులు
Nandyala | నంద్యాల, ఆగస్టు 6 (ఆంధ్రప్రభ): నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది.
ఏసీబీ అధికారులు కార్యాలయానికి చేరుకుని రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు సంబంధించిన రికార్డులు, పత్రాలు, కార్యాలయ పనితీరును క్షుణ్నంగా పరిశీలించినట్లు సమాచారం. ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్‌తో పాటు కార్యాలయ సిబ్బందిని పలు అంశాలపై ప్రశ్నించి వివరాలు సేకరించినట్లు తెలిసింది.

ఇటీవల భూముల రిజిస్ట్రేషన్లు, పత్రాల నమోదు ప్రక్రియలో అవకతవకలు, అక్రమాలపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలోనే ఏసీబీ ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. కార్యాలయంలో నమోదైన పత్రాలు, నగదు లావాదేవీలు, విధుల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలను అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది.
అయితే తనిఖీల్లో ఏవైనా అక్రమాలు వెలుగులోకి వచ్చాయా లేదా అనే అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారులు రూపొందించే నివేదిక అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఆకస్మిక తనిఖీలు నంద్యాల రిజిస్ట్రేషన్ శాఖలో చర్చనీయాంశంగా మారాయి. అధికారులు సేకరించిన వివరాల ఆధారంగా తదుపరి చర్యలు ఉండే అవకాశముందని సమాచారం.
