నందికొట్కూరులో జాతీయ లోక్ అదాలత్ ఘన విజయం..
ఒక్కరోజులో 916 కేసుల పరిష్కారం
సీనియర్ సివిల్ జడ్జ్ ఏ. శోభారాణి, జూనియర్ సివిల్ జడ్జ్ వి. దివ్య ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో కేసుల పరిష్కారం
నందికొట్కూరు, ఆంధ్రప్రభ: నంద్యాల జిల్లా నందికొట్కూరులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ఘన విజయాన్ని సాధించింది. స్థానిక సీనియర్ సివిల్ జడ్జి, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణంలో నిర్వహించిన ఈ లోక్ అదాలత్లో మొత్తం 916 కేసులను పరిష్కరించి రికార్డు సృష్టించారు.
సీనియర్ సివిల్ జడ్జి, లోక్ అదాలత్ ఛైర్మన్ ఏ. శోభారాణి, జూనియర్ సివిల్ జడ్జి వి. దివ్య స్వయంగా విచారణలో పాల్గొని కక్షిదారులకు సత్వర న్యాయం అందించారు. వారి చొరవతో అనేక వివాదాలు సామరస్యపూర్వకంగా పరిష్కారమయ్యాయి.
లోక్ అదాలత్లో 811 ప్లీ బార్గెయినింగ్ కేసులు, 28 క్రిమినల్ కేసులు, 7 ఎన్ఐ యాక్ట్ కేసులు, 33 ఎక్సైజ్ కేసులు, 11 సివిల్, ఆస్తి వివాదాలు, 14 బ్యాంకు కేసులు పరిష్కరించినట్లు న్యాయమూర్తులు తెలిపారు. మొత్తం 916 కేసులు పరిష్కారం కావడంతో నందికొట్కూరు కోర్టు చరిత్రలో ఇది ఒక విశేష ఘట్టంగా నిలిచింది.
జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి సహకరించిన బార్ అసోసియేషన్ న్యాయవాదులు, లోక్ అదాలత్ బెంచ్ నామినేటెడ్ సభ్యులు, పోలీసు అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, కక్షిదారులకు సీనియర్ సివిల్ జడ్జి ఏ. శోభారాణి, జూనియర్ సివిల్ జడ్జి వి. దివ్య ప్రత్యేక అభినందనలు తెలిపారు.
సామరస్యపూర్వక పరిష్కారమే లోక్ అదాలత్ ప్రధాన ఉద్దేశమని, ప్రజలకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యమని న్యాయమూర్తులు పేర్కొన్నారు. నందికొట్కూరు చరిత్రలో ఈ లోక్ అదాలత్ ఒక మైలురాయిగా నిలిచిందని న్యాయవాదులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
