గోనెగండ్ల రైతు ఈరమ్మ మృతి ఉద్రిక్తం..

  • మృతదేహంతో కలెక్టరేట్ ఎదుట రెండు గంటల ధర్నా
  • ఎమ్మార్వో, వీఆర్వో, సర్వేయర్‌తో పాటు ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్
  • పంచనామాలోనూ రాజకీయ జోక్యమా? అంటూ రైతు, రజక సంఘాల ఆగ్రహం

కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో భూ వివాదం నేపథ్యంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళా రైతు చాకలి ఈరమ్మ చికిత్స పొందుతూ మృతి చెందడంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతురాలి కుటుంబ సభ్యులు, రైతు సంఘాలు, రజక వృత్తిదారుల సంఘం నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈరమ్మ మృతికి కారణమైన అధికారులతో పాటు భూమి ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఐదు రోజుల పోరాటం తర్వాత మృతి..

భూ వివాదంతో తీవ్ర మనస్తాపానికి గురైన గోనెగండ్ల మండలం మహిళా రైతు చాకలి ఈరమ్మ గత వారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించగా, ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె బుధవారం మృతి చెందింది.

పంచనామా నిలిపివేతపై ఆందోళన..

మృతురాలి శవపంచనామా నిర్వహించకుండా రాజకీయ జోక్యంతో పోలీసులు ఆలస్యం చేశారని కుటుంబ సభ్యులు, రైతు సంఘాలు ఆరోపించాయి. మృతదేహానికి పంచనామా నిర్వహించాలంటూ ఆస్పత్రి మార్చురీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన అనంతరం మాత్రమే పోస్టుమార్టం నిర్వహించారని విమర్శించాయి. చనిపోయిన తర్వాత కూడా రాజకీయాలు చేయడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి. గురుశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.

మృతదేహంతో కలెక్టరేట్‌కు ర్యాలీ..

పోస్టుమార్టం అనంతరం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ నుంచి ఈరమ్మ మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ కుటుంబ సభ్యులు, రైతు సంఘాలు, రజక సంఘం నాయకులు కలెక్టరేట్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట దాదాపు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు.

26 సెంట్ల భూమే వివాదానికి కేంద్రబిందువు

గోనెగండ్ల మండలంలో తమకు చెందిన 26 సెంట్ల భూమిని రెవెన్యూ అధికారులు అక్రమంగా ఇతరుల పేర్లకు ఆన్‌లైన్‌లో నమోదు చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అదే భూమిలో సంజన్న కుమారులు దున్నుతుండగా అడ్డుకున్న ఈరమ్మపై దాడి జరిగిందని, ఆ అవమానం, ఒత్తిడిని తట్టుకోలేక ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని పేర్కొన్నారు.

అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

ఈరమ్మ మృతికి బాధ్యులైన గోనెగండ్ల తహసీల్దార్, మండల సర్వేయర్, గ్రామ వీఆర్వో, అలాగే భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపిస్తున్న వ్యక్తులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. రీసర్వే పేరుతో పేదల భూములను ఇతరులకు కట్టబెడుతున్న అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కోర్టు పరిధిలోని భూమిని ఎలా మార్చారు?

వివాదాస్పద భూమి కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ సంబంధిత కుటుంబానికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆన్‌లైన్ రికార్డుల్లో మార్పులు ఎలా చేశారని ప్రశ్నించారు. పేదల భూములను రక్షించడంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపాలని, భూ వివాదాలపై జిల్లా కలెక్టర్ స్వయంగా విచారణ చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆందోళన జరుగుతున్న ప్రాంతానికి జిల్లా రెవెన్యూ అధికారి చేరుకుని వినతిపత్రం స్వీకరించిన అనంతరం ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి. గురుశేఖర్, జిల్లా నాయకులు శ్రీనివాసులు, శేషాద్రి, జయమ్మ, రాముడు, కుటుంబ సభ్యులు, రైతులు, రజక సంఘాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.