చంద్రబాబుతో స్మృతి ఇరానీ భేటీ..!

  • మహిళల ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచే మార్గాలపై చర్చ
  • ప్రభుత్వం–పరిశ్రమలు–అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యానికి ప్రాధాన్యం

అమరావతి, ఆంధ్రప్రభ: కేంద్ర మాజీ మంత్రి, అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ – జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ చైర్‌పర్సన్ స్మృతి జుబిన్ ఇరానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహిళల సాధికారత, ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంపొందించే అంశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు.

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సహకారంతో, ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) నెట్‌వర్క్ భాగస్వామ్యంతో అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ – జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను ముఖ్యమంత్రికి స్మృతి ఇరానీ వివరించారు. మహిళలకు మరింత ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణను వివరించినట్లు తెలిపారు.

సమావేశంలో మహిళల ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు వ్యవస్థాపకత, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణల వంటి రంగాలు కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ రంగాల్లో మహిళలకు అవకాశాలు పెరిగితే భారతదేశ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని చర్చించారు.

అలాగే మహిళలకు మరిన్ని ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, అభివృద్ధి సంస్థల మధ్య సమన్వయం, భాగస్వామ్యం మరింత బలోపేతం కావాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. సమ్మిళిత అభివృద్ధిని సాధించి, మహిళల సాధికారతను కొలవదగిన ఫలితాలుగా మార్చేందుకు పరస్పర సహకారం ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు.

ఈ భేటీ ఎంతో సార్థకంగా సాగిందని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త అవకాశాలు కల్పించడం, దేశ అభివృద్ధిలో వారి పాత్రను మరింత బలోపేతం చేయడంలో ఇటువంటి భాగస్వామ్యాలు కీలకంగా నిలుస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.