విద్యా ప్రతిభకు బలిజ సంఘం ప్రోత్సాహం
విద్యా ప్రతిభకు బలిజ సంఘం ప్రోత్సాహం
120 మంది విద్యార్థులకు నగదు బహుమతులు.
మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా సన్మానాలు.
ప్రతిభను గుర్తించే బలిజ సంఘం ప్రత్యేక కార్యక్రమం
విద్యార్థులు, ఉద్యోగులకు ఒకే వేదికపై ఘన సత్కారం
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించి ఉన్నత లక్ష్యాల వైపు నడిపించాలనే ఉద్దేశంతో కర్నూలు నగర బలిజ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. స్థానిక బి.క్యాంప్‌లోని కాపు భవన్‌లో జరగనున్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ తదితర కోర్సుల్లో విశేష మార్కులు సాధించిన సుమారు 120 మంది బలిజ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, నగదు బహుమతులు అందజేయనున్నట్లు కర్నూలు నగర బలిజ సంఘం అధ్యక్షుడు లక్ష్మన్న, ప్రధాన కార్యదర్శి రవికుమార్ తెలిపారు.
శనివారం ఐదు రోడ్ల కూడలిలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, విద్యా రంగంలో రాణించిన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో విద్యా చైతన్యం మరింత పెంపొందుతుందని చెప్పారు.
విద్యార్థుల సన్మానంతో పాటు ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతను, పదవీ విరమణ చేసిన ఉద్యోగులను, వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను కూడా ప్రత్యేకంగా సత్కరించనున్నట్లు వెల్లడించారు. సమాజాభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులకు విశిష్ట పురస్కారాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
బలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
ఈ సమావేశంలో సంఘం ప్రధాన సలహాదారు సోమశేఖర్ సింగంశెట్టి, కోశాధికారి ప్రకాష్ బాబు, ఉపాధ్యక్షులు సహదేవుడు, రామిరెడ్డి, సహాయ కార్యదర్శి లక్ష్మీకాంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
