జిల్లా ఆసుపత్రి అభివృద్ధికి రూ.2.68 కోట్ల నిధులు

  • అవసరాలపై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
  • జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ తొలి సమావేశంలో కీలక నిర్ణయాలు
  • జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూల్ జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ తొలి సమీక్ష సమావేశం గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలు, మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాల అవసరాలు, భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి. ఉషారాణి ఆసుపత్రి ప్రస్తుత పరిస్థితి, రోగుల రద్దీ, అందుబాటులో ఉన్న వైద్య సేవలు, వివిధ విభాగాల్లో అవసరమైన ఆధునిక పరికరాల వివరాలను కమిటీకి వివరించారు. అనంతరం ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన చర్యలపై కలెక్టర్ సమగ్ర సమీక్ష నిర్వహించారు.

కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.2 కోట్ల 68 లక్షల 79 వేల 383 నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో ఆసుపత్రికి అత్యవసరంగా అవసరమైన వైద్య పరికరాలు, నిర్ధారణ యంత్రాలు, రోగుల చికిత్సకు ఉపయోగపడే ఆధునిక పరికరాలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.

నిధుల వినియోగంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూపరింటెండెంట్‌కు సూచించారు. ప్రతి విభాగం నుంచి అవసరాల జాబితాను సేకరించి, సాంకేతిక నివేదికలతో కూడిన సమగ్ర ప్రతిపాదనలను అత్యవసరంగా సమర్పించాలని ఆదేశించారు.

జిల్లా ప్రజలు మెరుగైన వైద్య సేవల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల వైద్య సదుపాయాలను జిల్లా కేంద్రంలోనే అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా అత్యవసర వైద్యం, నిర్ధారణ సేవలు, ప్రసూతి వైద్యం, శస్త్రచికిత్సలు, ఐసీయూ సేవల బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చాలని, వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన మందులు, పరికరాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న నిధులను పారదర్శకంగా వినియోగించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రికి అంబులెన్స్ లేదని సూపరింటెండెంట్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ఉన్న అంబులెన్స్‌ను ఆసుపత్రికి అందజేయాలని, దాని మరమ్మతులకు అవసరమైన నిధులను తానే సమకూరుస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో నాగర్‌కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సునంద, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి. ఉషారాణి, జిల్లా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహమ్మద్ దావూద్ సులేమాన్, డాక్టర్ శంకర్, డాక్టర్ సుప్రియ, డాక్టర్ రఘు, హరిత, సాయిబాబు, రాధాకృష్ణ, కవిత, పోతుల శిరీష, డాక్టర్ కృష్ణ, డాక్టర్ రామకృష్ణ, అభివృద్ధి కమిటీ సభ్యులు, డాక్టర్ కోటేశ్వర్, డాక్టర్ రవినాయక్, వివిధ విభాగాల వైద్యాధికారులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆసుపత్రి పరిపాలనా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.