Jongnanhai | తైవాన్ జోలికొస్తే.. ఖేల్ ఖతం
Jongnanhai | తైవాన్ జోలికొస్తే.. ఖేల్ ఖతం
Jongnanhai | ట్రంప్‌కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వార్నింగ్
చైనా హెచ్చరికలపై అమెరికా మౌనం
రెండు రోజుల పర్యటనలో వాణిజ్య ఒప్పందాలకే పరిమితం
టెక్ దిగ్గజాలు, టాప్ పారిశ్రామిక వేత్తలతో జిన్ పింగ్ చర్చలు
ఇరు దేశాలు వాణిజ్య రంగాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్లాలని నిర్ణయం
బీజింగ్, ఆంధ్ర్రప్రభ : బీజింగ్‌లోని అత్యంత కట్టుదిట్టమైన ‘జోంగ్నాన్హై’ కాంప్లెక్స్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన భేటీ కేవలం రెండు దేశాల మధ్య చర్చ మాత్రమే కాదు, ఇది ప్రపంచ గమనాన్ని మార్చే ఒక చదరంగంలా కనిపిస్తోంది. ఈ చర్చల్లో ప్రధానంగా వినిపించిన మాట ‘తైవాన్’. ఈ అంశంపై జిన్‌పింగ్ వాడిన భాష, చేసిన హెచ్చరికలు ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.
నిప్పు-నీరు కలవవని..
నిప్పు-నీరు కలవవు – జిన్‌పింగ్ కఠిన స్వరం తైవాన్ అంశంపై చైనా వైఖరి ఎప్పుడూ స్పష్టమే, కానీ ఈసారి జిన్‌పింగ్ మరింత ఘాటుగా స్పందించారు. “తైవాన్ స్వాతంత్య్రం, శాంతి అనేవి నిప్పు-నీరు లాంటివి.. అవి ఎప్పటికీ కలవవు” అని ఆయన తేల్చి చెప్పారు. ఈ సంబంధాన్ని సరిగ్గా నిర్వహిస్తే స్థిరత్వం ఉంటుందని, లేదంటే అది ఘర్షణకు దారితీసి అత్యంత ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని నేరుగా ట్రంప్‌కే హెచ్చరికలు పంపారు. ట్రంప్ తన నిర్ణయాలను మార్చుకుంటారనే చరిత్ర ఉంది కాబట్టే, జిన్‌పింగ్ స్వయంగా ఈ విషయాన్ని నొక్కి చెప్పినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
థుసిడిడెస్ ట్రాప్ అంటే ఏమిటి?
చర్చల సందర్భంగా జిన్‌పింగ్ పురాతన గ్రీకు సిద్ధాంతమైన ‘థుసిడిడెస్ ట్రాప్’ను ప్రస్తావించారు. అంటే, ఒక అగ్రరాజ్యం ఎదుగుతున్న మరో శక్తిని అడ్డుకోవాలని చూసినప్పుడు అది అనివార్యంగా యుద్ధానికి దారితీస్తుంది. పశ్చిమ దేశాల ప్రభావం తగ్గుతోందని, చైనా ఎదుగుతోందని నమ్ముతున్న జిన్‌పింగ్, తైవాన్ విషయంలో ఉమ్మడి ఆమోదం లేకపోతే అమెరికాతో ముఖాముఖి తలపడక తప్పదనే హెచ్చరికను ఇందులో పొందుపరిచారు.
మరోవైపు ఇరాన్ మంటలు
తైవాన్‌పై ఇంత ఉద్రిక్తత ఉన్నప్పటికీ, ఇరాన్ విషయంలో మాత్రం ఇద్దరు నేతలు ఒకే తాటిపై ఉన్నట్లు ట్రంప్ ప్రకటించడం విశేషం. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసుకోకూడదని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇది ప్రపంచానికి ఊరటనిచ్చే అంశమే కావొచ్చు. కానీ, ఇరాన్ దీనిని ఎంతవరకు సమ్మతిస్తుంది అన్నది తెలియాలి. తాము అణ్వాయుధాలు తయారు చేసుకోవడం లేదని, శుద్ధిచేసిన యూరేనియంను ఇతర అవసరాల కోసం వినియోగించుకుంటున్నట్టు ఇప్పటికే పలుమార్లు ఇరాన్ స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని రష్యా కూడా దృవీకరించింది. అంతేకాదు, అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి ఎప్పుడూ తెరిచే ఉంచాలని ఇద్దరు నేతలు అంగీకరించారు. ఇక ఈ చర్చల అనంతరం ట్రంప్ తనదైన శైలిలో మరెవ్వరూ పరిష్కరించలేని సమస్యలను తాము పరిష్కరించాలమని ప్రకటించారు.
45 ఏళ్ల నాటి ఒట్టును తీసి గట్టున పెట్టిన ట్రంప్..
ట్రంప్ బృందంలో చైనా వ్యవహారాలు క్షుణ్ణంగా తెలిసిన నిపుణులు లేకపోవడం చైనాకు అడ్వాంటేజ్‌గా మారిందనే వాదన వినిపిస్తోంది. తైవాన్ విషయంలో భయం పెట్టి, బదులుగా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు లేదా మార్కెట్ ప్రవేశం వంటి అంశాల్లో ట్రంప్ నుంచి రాయితీలు పొందాలని చైనా భావిస్తోంది. అందుకనుగుణంగా అమెరికా వాణిజ్య వేత్తలతో చైనా బృందం చర్చలు జరిపింది.. ఇక అమెరికా టాప్ పారిశ్రామికవేత్తలు, టెక్ దిగ్గజాలు చైనా మార్కెట్ పై కన్ను వేశాయి..
అక్కడ పాతుకుపోయేందుకు ఏకంగా చైనా అధ్యక్షుడితో చర్చలు జరిపారు.. ఇరువైపుల ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఇరు దేశాల వ్యవహరించాలనే నిర్ణయంపై అందరూ అంగీకరించడం విశేషం. ట్రంప్ కూడా వివిధ వాణిజ్య ఒప్పందాలు కుదరడం పట్ల కుష్ అవుతున్నారు.. అయితే అవి ఎంతవరకు గ్రౌండ్‌కు చేరుకుంటాయో వేచిచూడాల్సిందే. ఇక తైవాన్ పై అమెరికా తన సుదీర్ఘకాలపు ‘వ్యూహాత్మక అస్పష్టత’ విధానాన్ని వీడుతుందా లేదా అనేది వేచి చూడాలి. మొత్తంగా చూసుకుంటే బీజింగ్ చర్చలు శాంతి వైపు సాగుతున్నాయా లేక పెను తుఫానుకు ముందున్న ప్రశాంతతనా అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది.
