Bandi Bhagirath | ఆమె మైనరే!

Bandi Bhagirath | ఆమె మైనరే!
Bandi Bhagirath | పోలీసుల నిర్ధారణ.. సిట్ వేట
టెన్త్ సర్టిఫికెట్, బోనఫైడ్ ఆధారం
అన్ని రికార్డులను పరిశీలించిన పోలీసులు
ఆ తర్వాతే పోక్సో చట్టం విధిస్తూ కేసు నమోదు
నిందితుల పక్షం ధ్రువీకరణను సవాల్ చేసే చాన్స్
రికార్డుల విశ్లేషణలో సుప్రీంకోర్టు రూలింగ్స్
సోషల్ మీడియాలో పలు తప్పుడ ప్రచారాలు
భగీరథ్‌ను ఎవరూ కాపాడలేరంటున్న అడ్వొకేట్లు
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయంటే
భగీరత్ భవిష్యత్‌కు విషమ పరీక్ష!
Bandi Bhagirath | సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన బండి భగీరథ్ కేసు ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో నిందితుడి భవితవ్యం మొత్తం బాధితురాలి వయస్సు అనే ఏకైక పాయింట్ మీద ఆధారపడి ఉంది. పోలీసులు ఇప్పటికే ఆమెను మైనర్‌గా గుర్తిస్తూ ప్రాథమికంగా పోక్సో చట్టం కింద సెక్షన్లు నమోదు చేశారు. ఒకవేళ విచారణలో బాధితురాలు మైనర్ అని న్యాయస్థానం ముందు నిరూపితమైతే, భగీరథ్‌కు కఠిన శిక్షలు తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. బాధితురాలి స్కూల్ రికార్డులు , బోనఫైడ్ సర్టిఫికేట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమికంగా ఈ రికార్డుల ప్రకారం ఆమె మైనర్ అని తేలడంతోనే పోలీసులు పోక్సో చట్టాన్ని ప్రయోగించారు. ఈ చట్టం ప్రకారం, బాధితురాలు మైనర్ అయితే ఆమె అంగీకారంతో సంబంధం లేకుండా అది తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అందుకే.. నిందితుల పక్షం ఈ వయస్సు ధ్రువీకరణను సవాల్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, విద్యాశాఖ రికార్డుల ముందు ఇతర వాదనలు నిలవడం కష్టమని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
రికార్డుల విశ్లేషణలో సుప్రీంకోర్టు రూలింగ్స్
వయస్సు నిర్ధారణ విషయంలో సుప్రీంకోర్టు గతంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. మొదటగా పదో తరగతి మార్కుల జాబితా లేదా పాఠశాల రికార్డులను ప్రామాణికంగా తీసుకోవాలి. అవి లేనప్పుడు మాత్రమే మున్సిపల్ బర్త్ సర్టిఫికేట్ లేదా మెడికల్ బోర్డ్ ఇచ్చే ఆసిఫికేషన్ టెస్ట్ నివేదికను పరిగణనలోకి తీసుకుంటారు. భగీరథ్ కేసులో విద్యా రికార్డుల ప్రకారం ఆమె మైనర్ అని ఇప్పటికే పోలీసులు నిర్ధారించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే, నిందితుడికి న్యాయపరంగా పెద్ద గండం పొంచి ఉన్నట్టేనని న్యాయవాదులు అంటున్నారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు..
మరోవైపు, సోషల్ మీడియాలో బాధితురాలు మేజర్ అని, ఆమెకు సంబంధించిన కొన్ని ఇతర ఐడెంటిటీ కార్డుల్లో పుట్టిన తేదీ వేరేలా ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇటువంటి అడ్మినిస్ట్రేటివ్ రికార్డులు విద్యా రికార్డుల ముందు కోర్టులో చెల్లవు. అయితే.. తల్లిదండ్రులు సమర్పించిన డాక్యుమెంట్లలో హాస్పిటల్‌లో జనన సర్టిఫికెట్, అదే సర్టిఫికెట్‌ను జీహెచ్ఎంసీలో సమర్పించిన వివరాల డాక్యుమెంట్‌ను కోర్టుకు అందజేశారు. కాగా, సిట్ అధికారులు జీహెచ్ఎంసీ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించినట్టు తెలుస్తోంది. ఒకవేళ రికార్డుల ట్యాంపరింగ్ జరిగిందని నిరూపించగలిగితే తప్ప, ప్రస్తుతానికి పోలీసుల వద్ద ఉన్న ఆధారాల ప్రకారం బాధితురాలు మైనర్ అనే పాయింటే బలంగా ఉందనే వాదనలున్నాయి.
భగీరథ్ భవిష్యత్తుకు పరీక్ష..
ఈ కేసులో అంగీకారం అనే వాదన వినిపించడానికి నిందితుల వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, బాధితురాలు మైనర్ అని పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేస్తే, అంగీకారంతో పనిలేకుండానే విచారణ సాగుతుంది. పైగా పోక్సో కేసుల్లో బెయిల్ రావడం కూడా అంత సులభం కాదు. బాధితురాలి వయస్సుపై పోలీసులు సమర్పించే తుది నివేదిక భగీరథ్ భవిష్యత్తును నిర్ణయించనుంది. ఒకవేళ మైనర్ అని తేలితే మాత్రం, ఈ కేసు నుంచి బయటపడటం భగీరథ్‌కు అసాధ్యమనే చెప్పాలని వకీల్‌సాబ్‌లు స్పష్టం చేస్తున్నారు.
click here to read మొయినాబాద్ ఫామ్ హౌస్ వద్ద ఘటన
