కాలువల నిర్లక్ష్యంతో నీరు వృథా..

కాలువల నిర్లక్ష్యంతో నీరు వృథా..
మునుగోడు, ఆంధ్రప్రభ : కాలువల నిర్లక్ష్యం కారణంగా సాగునీరు వృథా అవుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మండలంలోని పలివెల–చీకటిమామిడి గ్రామాల మధ్య ఉన్న చెక్‌డ్యామ్,ఫీడర్ చానల్‌కు అనుబంధ కాలువలను ఆమె పరిశీలించారు. కాలువలు సక్రమంగా లేకపోవడంతో నీరు చెరువులకు చేరకుండా మధ్యలోనే వృథా అవుతోందని తెలిపారు. పలివెల, ఎల్లలగూడెం, కచలాపురం, జక్కలవారిగూడెం, సింగారం,మునుగోడు, జమస్తాన్‌పల్లి తదితర గ్రామాలకు అందాల్సిన సాగునీరు అందడం లేదన్నారు.
పలివెల ఫీడర్ చానల్ వద్ద గేట్లు దెబ్బతినడంతో సమస్యలు మరింత పెరిగాయని పేర్కొన్నారు. కాలువల్లో కంప చెట్లు పెరగడంతో నీరు దారి మళ్లి చెరువులు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయని చెప్పారు.స్వల్ప మరమ్మత్తులు చేపడితే నీటి నిల్వ సాధ్యమని సూచించారు.ప్రభుత్వం వెంటనే స్పందించి కాలువలు,గేట్ల మరమ్మత్తులు చేపట్టాలని, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మారగొని అంజయ్య గౌడ్,మేకల శ్రీనివాస్ రెడ్డి,గజ్జల బాలరాజు గౌడ్,మార్త మోహన్ రెడ్డి, పాల్వాయి వెంకట్ రెడ్డి, నాతి లింగస్వామి, జిట్టగోని మల్లేష్,ఐతగోని విజయ్,సునీల్ గవాస్కర్, బొమ్మగోని లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
