ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ఇతోదికంగా నిధులు కేటాయిస్తోంది…

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

కంచికచర్ల, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఇతోదికంగా నిధులు కేటాయిస్తున్నదని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. కంచికచర్ల మండలం పరిటాలలో 40 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించ తలపెట్టిన హెల్త్ సెంటర్, 15 లక్షల రూపాయలతో ఎస్సీ కాలనీలో నిర్మించ తలపెట్టిన బరియల్ గ్రౌండ్ కాంపౌండ్ వాల్ పనులకు ఎమ్మెల్యే సౌమ్య సోమవారం రాత్రి భూమి పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుండి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. గ్రామాల్లో త్రాగునీరు విద్య వైద్యం వంటి రంగాల అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నదన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని సమస్యలను తక్షణం పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోగంటి బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.