నున్న సహకార సంఘానికి కేడీసీసీబీ ఘన సత్కారం
రూ.28.71 కోట్ల రుణాలపై వంద శాతం వసూళ్లతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో అగ్రస్థానం
వార్షిక సర్వసభ్య సమావేశంలో సొసైటీ చైర్మ్న్ కలకోటి శ్రీనివాసరెడ్డి, సీఈఓ రమేష్‌ను సన్మానించిన చైర్మన్ నెట్టెం శ్రీ రఘురామ్
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.28.71 కోట్ల రుణాలను వంద శాతం వసూలు చేసి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని 425 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన విజయవాడ రూరల్ మండలం నున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ప్రతినిధులను కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ) చైర్మన్ నెట్టెం శ్రీ రఘురామ్ సత్కరించారు.
సోమవారం మచిలీపట్నంలో నిర్వహించిన కేడీసీసీబీ వార్షిక సర్వసభ్య సమావేశంలో నున్న సహకార సంఘం త్రిసభ్య కమిటీ అధ్యక్షుడు కలకోటి శ్రీనివాసరెడ్డి, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) తాడంకి రమేష్‌కు ప్రశంసా పత్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలంలోని నున్నలో ఉన్న 108 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సహకార సంఘం 2025-26 ఆర్థిక సంవత్సరంలో పంపిణీ చేసిన రూ.28.71 కోట్ల రుణాలను పూర్తిస్థాయిలో వసూలు చేయడమే కాకుండా జూన్ 30 గడువు తేదీకి ఎనిమిది రోజుల ముందుగానే లక్ష్యాన్ని చేరుకుంది.
కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలతో పాటు కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 425 సహకార సంఘాల్లో నున్న సంఘం అత్యుత్తమ పనితీరు కనబరిచింది. జిల్లాలోని 61 సంఘాలు వంద శాతం రుణ వసూళ్లు సాధించినప్పటికీ, అత్యధికంగా రూ.28.71 కోట్ల రుణాలను పూర్తిగా వసూలు చేసిన సంఘంగా నున్న ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఈ సందర్భంగా నెట్టెం శ్రీ రఘురామ్ మాట్లాడుతూ రుణాల పంపిణీతో పాటు సకాలంలో వసూళ్లు సాధించడం ద్వారా నున్న సంఘం రాష్ట్రంలోని ఇతర సహకార సంఘాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. సంఘం పాలకవర్గం, ఉద్యోగులు, సభ్య రైతుల సమిష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని అభినందించారు.
సహకార రుణ వ్యవస్థ బలోపేతానికి సకాలంలో రుణ వసూళ్లు అత్యంత అవసరమని పేర్కొంటూ, నున్న సంఘం సాధించిన విజయం ఇతర సంఘాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.
108 ఏళ్ల చరిత్ర కలిగిన నున్న సహకార సంఘం రైతులకు ఆర్థిక సహాయం అందించడంలో, వ్యవసాయాభివృద్ధికి తోడ్పడడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రైతుల్లో సహకార వ్యవస్థపై పెరుగుతున్న విశ్వాసానికి ఈ విజయమే నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ వెంకట రామకృష్ణ, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యనిర్వహణాధికారి శ్యామ్ మనోహర్, ప్రొఫెషనల్ డైరెక్టర్ మురళీధర్, రాష్ట్ర సహకార బ్యాంకు జనరల్ మేనేజర్ యమున, డి.ఎల్. చంద్రశేఖర్ రెడ్డి, జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, రంగబాబు తదితరులు పాల్గొన్నారు.
