బెంగళూరులో తెలంగాణ ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్

  • అంతర్రాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్ అరెస్ట్
  • 241 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: హైదరాబాద్ ఈగల్ ఫోర్స్, బెంగళూరు ఎన్‌సీబీ అధికారులు, షాద్‌నగర్ పోలీసులతో కలిసి బెంగళూరులో భారీ ఆపరేషన్ చేపట్టారు.ఈ ఆపరేషన్‌లో కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాకు చెందిన రాకేశ్ అనే అంతర్రాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్‌ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 241 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈగల్ ఫోర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు రాహుల్ (24) బీటెక్ పూర్తి చేసి బెంగళూరులోని టయోటా షోరూంలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా, అక్కడే పరిచయమైన డ్రగ్స్ వినియోగదారుల ద్వారా మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. అనంతరం నైజీరియాకు చెందిన మైఖేల్ జాన్సన్ అలియాస్ హానర్‌తో పరిచయం ఏర్పడింది. మైఖేల్ ద్వారా రాహుల్ డ్రగ్స్ వ్యాపారంలోకి దిగాడు. మైఖేల్ జాన్సన్‌ను బెంగళూరు పోలీసులు గతంలో దేశం నుంచి బహిష్కరించగా, నైజీరియా నుంచి ఫోన్‌ల ద్వారా తన నెట్‌వర్క్‌ను కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలింది.

వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా ఆర్డర్లు తీసుకుని ‘డెడ్ డ్రాప్’ పద్ధతిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కస్టమర్లు పంపిన డబ్బులు అందిన తర్వాత డ్రగ్స్‌ను ఎవరికి తెలియని ప్రాంతాల్లో దాచిపెట్టి, ఆ ప్రదేశాల వివరాలను వాట్సాప్ ద్వారా కస్టమర్లకు పంపేవారని అధికారులు తెలిపారు. జూన్ 10న మోహిత్ కుమార్ అనే వ్యక్తిని ఈగల్ ఫోర్స్, షాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి ద్వారా రాహుల్ వివరాలను తెలుసుకుని, జూన్ 28న దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణకు చెందిన 10 మంది గుర్తింపు..

డబ్బు లావాదేవీలను పరిశీలించిన ఈగల్ బృందం తెలంగాణకు చెందిన 10 మంది పెడ్లర్లు, కస్టమర్లను గుర్తించింది. గచ్చిబౌలి, జవహర్‌నగర్, పేట్‌బషీరాబాద్, ఖర్కానా, షామీర్‌పేట్, గోల్కొండ ప్రాంతాలకు చెందిన పలువురితో డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: ఈగల్ ఫోర్స్

డ్రగ్స్ కారణంగా యువత, విద్యార్థులు నేరాలకు పాల్పడుతున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని ఈగల్ ఫోర్స్ సూచించింది. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1908 లేదా వాట్సాప్ నంబర్ 87126 71111కు తెలియజేయాలని కోరింది.