ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రధానమంత్రి వర్చువల్ సమావేశం

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో “నషా ముక్త యువ – వికసిత భారత్” కార్యక్రమంపై జాతీయ స్థాయి వర్చువల్ సమావేశం ఆదివారం ఎన్ఐసీ పోర్టల్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి జెన్- జీ యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ, మాదక ద్రవ్యాల రహిత భారత నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని, యువతకు మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ లక్ష్య సాధన కోసం దేశవ్యాప్తంగా 100 వారాల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. మరియు దేశ పురోగతికి యువత యొక్క సహకారం ఎంతగానో కావాలని దేశ భవిష్యత్తు యువతపై ఆధార పడి ఉంది అని చెప్తూ 2047 లోపు భారతదేశాన్ని వికసిత్ భారత్ గా ఎలా మలచుకోవాలి అన్న దానిపై దిశానిర్దేశం చేశారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదగాలని పిలుపునిచ్చారు. విద్యార్థులను ఉద్దేశించి తాము మాత్రమే కాదు, తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. శైలజా రాణి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ టి. ఎన్. మస్తానప్ప, ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాధికారులు విష్ణుప్రియ, సుధాకర్ ఎన్‌సీసీ అధికారి ప్రశాంత్, అధ్యాపకులు అయ్యన్న, సిరాజ్ అలీ ఖాన్, డాక్టర్ వెంకటరాముడు, నారాయణస్వామి, జమీలా బీబి, సుజాత, వెంకటేష్, అంజనేయులు, రమేష్, నాగేంద్ర, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అనంతరం ప్రిన్సిపాల్ డాక్టర్ శైలజా రాణి మాట్లాడుతూ, ప్రధానమంత్రి పిలుపు మేరకు కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ ఆధ్వర్యంలో నషా ముక్త యువ గురించి విశ్లేషించడం జరిగిందన్నారు. యువత తమ జీవిత లక్ష్యాలను సాధించాలంటే వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలని అన్నారు. ఇందులో భాగంగా కళాశాల యన్ ఎస్ ఎస్ పీఓ యం. విష్ణు ప్రియ మాట్లాడుతూ మాదకద్రవ్యాల నివారణ యొక్క ప్రాముఖ్యత గురించి విస్తృతంగా వివరించారు. వాటి నుండి ఎలా బయటపడాలి అన్న దానిపై విద్యార్థులలో అవగాహన కల్పించారు. కళాశాల యన్ ఎస్ ఎస్ పీఓ సుధాకర్ నేటి యువత పై మాదకద్రవ్యాల ప్రభావం ఎలా ఉంది అన్న విషయం పై ప్రత్యేకంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్యార్థులు మణి, ఫరీదా ఉత్సాహంగా మాట్లాడుతూ వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఇందులో భాగంగా అనంతపురం ఆర్ట్స్ కళాశాల కు చెందిన వెంకటసాయి తన యొక్క నుక్కడ్ నాటక్ (మైమ్) ప్రదర్శనతో విద్యార్థులలో మాదకద్రవ్యాల నివారణ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ఎస్ . కే. యూ మైభారత్ నోడల్ ఆఫీసర్ యం.విష్ణుప్రియ ఆధ్వర్యంలో నిర్వహించారు.