రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం..
- హైవే పెట్రోలింగ్ సిబ్బందికి డీఎస్పీ శ్రావణ్ కుమార్ దిశానిర్దేశం
ఏలూరు, ఆంధ్రప్రభ : ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సోమవారం ఏలూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ సెంటర్లో హైవే పెట్రోలింగ్ సిబ్బందికి ప్రత్యేక అవగాహన, కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ హాజరై సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణలో హైవే పెట్రోలింగ్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

జాతీయ రహదారులపై వాహనాలు అనవసరంగా నిలిపివేయకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని, నిలిచిపోయిన వాహనాలను వెంటనే తొలగించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే హైవేల వెంట అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టులు, ఆహార విక్రయ కేంద్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లు తదితర వాణిజ్య సంస్థల యజమానులు తమ ఖర్చుతో భద్రతా సిబ్బందిని నియమించుకోవడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు.
హైవే భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డీటీఆర్బీ ఎస్ఐ శ్రీ కె. రాంబాబు మాట్లాడుతూ, జాతీయ రహదారులపై నిలిచిపోయిన వాహనాలను వెంటనే తొలగించడం పోలీసులతో పాటు హైవే పెట్రోలింగ్ సిబ్బంది బాధ్యత కూడా అని పేర్కొన్నారు. అందరూ సమన్వయంతో పనిచేసి రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీటీఆర్బీ మధు, డీటీఆర్బీ సిబ్బంది, హైవే పెట్రోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
