కాసిపేటలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు
ఐదుగురు అరెస్ట్.. రూ.1.10 లక్షల నగదు, ఫోన్లు, బైక్‌లు స్వాధీనం
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం గ్రామంలో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై రామగుండం పోలీస్ కమిషనరేట్ నార్కోటిక్, టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు.
విశ్వసనీయ సమాచారంతో చేపట్టిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.1,10,630 నగదు, 52 పేకముక్కలు, 5 మొబైల్ ఫోన్లు, 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కాసిపేట పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
