చినమామిడిపల్లిలో సమస్యల మోత..
ఆర్డీఓకు స్థానికుల వినతి
తాగునీరు, వీధి దీపాలు, కనీస వసతులు కల్పించాలని విజ్ఞప్తి
నర్సాపురం, ఆంధ్రప్రభ: నర్సాపురం పట్టణ శివారు ప్రాంతంలోని 31వ వార్డు చినమామిడిపల్లిలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారం కోసం స్థానికులు ఆర్డీఓ దాసిరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ కార్యదర్శి నెక్కంటి క్రాంతికుమార్ మాట్లాడుతూ, చినమామిడిపల్లి ప్రాంత ప్రజలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కనీస మౌలిక వసతులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.
ప్రాంతంలో మంచినీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని, సరఫరా అవుతున్న తాగునీటికి దుర్వాసన వస్తోందని తెలిపారు. అలాగే చినమామిడిపల్లి వంతెనపై వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
రైల్వే స్టేషన్ రోడ్డులోని వీధి దీపాలు కూడా పనిచేయడం లేదని, వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించి, వీధి దీపాలను ఏర్పాటు చేయాలని ఆర్డీఓను కోరారు.
వినతిపత్రం అందజేసిన వారిలో చినిమిల్లి వెంకటేశ్వరరావు, కంచర్ల త్రినాథరావు, ఏలూరి పేరరాజు, బళ్ళ శ్రీను, బళ్ళ ధరణి, పోతురాజు ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
వినతిపత్రంలో పేర్కొన్న సమస్యలను పరిశీలించి, తక్షణ చర్యలు తీసుకుని పరిష్కరిస్తామని ఆర్డీఓ దాసిరాజు హామీ ఇచ్చారు.
