జగన్ రైతు సమావేశాన్ని విజయవంతం చేయాలి…

కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు


ఏలూరు, జులై 31 (ఆంధ్రప్రభ): పొగాకు సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పొగాకు ధరల పతనం, పంట కొనుగోళ్లలో జరుగుతున్న అవకతవకలపై రైతులతో నేరుగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 5న తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో నిర్వహించనున్న రైతు సమావేశాన్ని విజయవంతం చేయాలని ఏలూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్‌ఆర్) పిలుపునిచ్చారు.

ఈ మేరకు శుక్రవారం జరిగిన సన్నాహక సమావేశంలో చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు అధ్యక్షతన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్‌నాథ్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాల్, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాష్ట్ర కార్యదర్శి, కృష్ణాజిల్లా పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథ్‌రావు, ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ), పోలవరం నియోజకవర్గ ఇన్‌చార్జి తెల్లం బాలరాజుతో కలిసి దూలం నాగేశ్వరరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు, రైతుల అభిప్రాయాలను నేరుగా తెలుసుకునేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేవరపల్లిలో రైతులతో సమావేశం కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.