రంగంలోకి ప్రత్యేక నిపుణుల బృందాలు..
ఏలూరు, ఆంధ్రప్రభ : ఏలూరు – రాజమండ్రి – కాకినాడ – చింతూరు – పాపికొండ నేషనల్ పార్క్ ప్రాంతాలలో సంచరిస్తున్న పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీ శాఖ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే మహారాష్ట్ర (వార్ధా, పుణే) బృందాలతో పాటు, బెంగళూరు నుండి ‘వైల్డ్లైఫ్ ఎస్ ఓ ఎస్ నిపుణుల బృందాన్ని, వార్ధా నుండి ‘పీపుల్ ఫర్ యానిమల్స్’ బృందాన్ని, అలాగే వివిధ టైగర్ రిజర్వ్ల నుండి అనుభవజ్ఞులైన ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దించామని జిల్లా అటవీ శాఖాధికారి పి .వి. సందీప్ రెడ్డి చెప్పారు. మత్తుమందు తుపాకీలతో పులిని బంధించడంలో నైపుణ్యం ఉన్న ఆరుగురు (6) ట్రాంక్విలైజింగ్ షూటర్లను సిద్ధంగా ఉంచామన్నారు.

ప్రస్తుత పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు తానూ క్షేత్రస్థాయిలో పర్యటించి ఆపరేషన్ ను అమలును పరిశీలిస్తున్నాన్నారు. పరిశీలించారు. పులి చాలా చురుగ్గా, చాకచక్యంగా ప్రవర్తిస్తోందని, మానవ సంచారం ఉన్న ప్రాంతాలను, చివరకు ప్రత్యేకంగా అమర్చిన మంచెలను కూడా చాలా తెలివిగా గమనిస్తూ, మనుషులు ఉండే ప్రదేశాలను తప్పించుకుంటూ ప్రయాణిస్తోందన్నారు. అయినప్పటికీ, నిపుణుల బృందాలు పక్కా వ్యూహంతో పులిని క్షేమంగా బంధించడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయన్నారు.

ప్రతిరోజూ పులి సంచారాన్ని నిరంతరం ట్రాక్ చేస్తూ… పాములవారిగూడెం, స్వర్ణవారిగూడెం, పుల్లెపూడి, అక్కంపేట, ముసన్నగూడెం, శ్రీనివాసపురం, పెద్దిపల్లి, రామచర్లగూడెం, తడువాయి, రామాన్నపాలెం, ఎ.పోలవరం, సూరంపల్లి, మాతంగిగూడెం, బోర్రంపాలెం, తిరుమలాదేవిపేట మరియు సమీప గ్రామాల ప్రజలను డప్పు చాటింపులు మరియు మైక్ అనౌన్స్మెంట్ల ద్వారా అప్రమత్తం చేస్తున్నామన్నారు. కన్నాపురం, పోలవరం, కుకునూరు మరియు జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ రేంజ్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పూర్తి అప్రమత్తతతో ఉన్నారని, . ప్రజలు కూడా భయాందోళన చెందకుండా అటవీ శాఖ సూచనలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని సందీప్ రెడ్డి కోరారు.
