ఆషాఢ సారె ఉత్సవాలతో ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం

ఆషాఢ సారె ఉత్సవాలతో ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం

వారాంతపు సెలవులతో భారీగా పెరిగిన రద్దీ..
సారె సమర్పణకు మహిళల విశేష స్పందన
భక్తులకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
శనివారం 49,910 మంది అమ్మవారి దర్శనం

( ఇంద్రకీలాద్రి ఆంధ్రప్రభ ) ఆషాఢ సారె ఉత్సవాలు, వారాంతపు సెలవుల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి శనివారం భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు, భక్త బృందాలతో కలిసి అమ్మవారికి పవిత్ర సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహామండపం ఆరవ అంతస్తులో ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద వేద మంత్రోచ్చారణల మధ్య సారె సమర్పణ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.

ప్రత్యేక ఏర్పాట్లు..

భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, సారె సమర్పణ, ప్రసాదాల పంపిణీ, అన్నదానం, తలనీలాల సమర్పణ తదితర సేవల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. దేవస్థాన పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీ, కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలిస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందేలా అధికారులకు సూచనలు జారీ చేశారు. శనివారం సాయంత్రం నిర్వహించిన అమ్మవారి పంచహారతుల సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ వివరాలు..

దేవస్థానం విడుదల చేసిన నిత్య గణాంకాల ప్రకారం శనివారం 8,819 దర్శన టికెట్లు జారీ చేయగా, మొత్తం 49,910 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 69,870 ప్రసాద విక్రయించగా, రూ.29,45,570 విరాళాల రూపంలో ఆదాయం లభించింది. వివిధ సేవల్లో 407 మంది పాల్గొనగా, 1,678 మంది తలనీలాలు సమర్పించారు. ఉచిత అన్నదానాన్ని 9,960 మంది భక్తులు స్వీకరించారు. ఆషాఢ సారె ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని దేవస్థానం అధికారులు తెలిపారు.