Weather Update | పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
హైదరాబాద్‌లో సాయంత్రం వాన ప‌డే చాన్స్‌

Weather Update | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణలో నేడు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దిగువ స్థాయి గాలుల కలయిక (లో లెవల్‌ కన్వర్జెన్స్‌) కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడినట్లు వాతావరణ నిపుణులు వెల్లడించారు.

ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నిర్మల్‌ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

రాజధాని హైదరాబాద్‌లో ప్రస్తుతం ఎండ, మేఘాల మధ్య వాతావరణం కొనసాగుతున్నప్పటికీ.. సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.