ఉద్యోగాలిచ్చే వరకు ఉద్యమం ఆగ‌దు: కల్వకుంట్ల కవిత

  • మెడికల్ అన్‌ఫిట్ దరఖాస్తుదారులందరికీ న్యాయం చేయాలని డిమాండ్
  • మొక్కుబడిగా మెడికల్ బోర్డు నిర్వహిస్తే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక
  • సింగరేణి ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయాలని తెలంగాణ రక్షణ సేన పిలుపు

హైదరాబాద్, ఆంధ్రప్రభ: మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న సింగరేణి కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించే వరకు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగిస్తామని ఆ సంస్థ చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. దాదాపు రెండు వేల మంది కార్మికుల వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని, అప్పటి వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

ప్రభుత్వం మెడికల్ బోర్డును మొక్కుబడిగా నిర్వహిస్తోందని ఆమె విమర్శించారు. రెండు వేల మంది కార్మికులు మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తుండగా కేవలం 120 మంది పేర్లనే ప్రకటించారని, వారిలో కూడా పలువురికి సమాచారం అందలేదని పేర్కొన్నారు. మెడికల్ బోర్డుకు హాజరైన వారిలో కేవలం 20 శాతం మందినే అన్‌ఫిట్‌గా ప్రకటించడం అన్యాయమన్నారు. గతంలో అమలైన విధంగానే అన్‌ఫిట్ ప్రక్రియను కొనసాగించి, ప్రతి నెల రెండు సార్లు మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

సింగరేణి సంస్థను బలోపేతం చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని, కార్మికుల ప్రయోజనాల కంటే ఇతర అంశాలపైనే దృష్టి పెట్టిందని ఆమె ఆరోపించారు. సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ అంశంపై స్పందించాలని, కోల్‌బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులను నిలదీయాలని హెచ్‌ఎంఎస్, తెలంగాణ రక్షణ సేన శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్మికులకు తెలంగాణ రక్షణ సేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.