KTR | కళను ప్రోత్సహించడం బాధ్యత

శేఖర్ కళా ప్రస్థానం నేటి తరానికి స్ఫూర్తి: కేటీఆర్
కార్టూన్లతో సమాజాన్ని ఆలోచింపజేసిన మహనీయుడు శేఖర్
ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించి ప్రోత్సహించాలి
శేఖర్ స్మారక అవార్డుల కార్యక్రమంలో విజేతలకు పురస్కారాలు ప్రదానం
తెలంగాణ ఉద్యమ సమయంలో శేఖర్ కార్టూన్ల పాత్ర మరువలేనిది
వచ్చే ఏడాది నుంచి శేఖర్ అవార్డులు మరింత ఘనంగా నిర్వహిస్తాం: కేటీఆర్

KTR |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారకార్థం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డ్స్–2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై అవార్డు గ్రహీతలకు పురస్కారాలు అందజేశారు. కార్టూన్ విభాగంలో కార్టూనిస్ట్ ఎం. నారు, ఆర్టిస్ట్ విభాగంలో చిత్రకారుడు కూరెళ్ల శ్రీనివాస్ అవార్డులను అందుకున్నారు.

కార్టూన్లు సమాజానికి అద్దం పడతాయి
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజకీయ జీవితంలో ప్రతిరోజూ విమర్శలు, ప్రతి విమర్శల మధ్య గడిపే తమకు సాహిత్య, కళా కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుందని అన్నారు. కళాకారులు, రచయితలు, కవులు, చిత్రకారులతో కలిసే అవకాశాలు అరుదుగా వస్తాయని, ఇలాంటి వేదికలు పాత జ్ఞాపకాలను, ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేస్తాయని పేర్కొన్నారు. “ఒక చిత్రం వెయ్యి పదాలతో సమానం” అనే నానుడిని ప్రస్తావిస్తూ.. సమాజం, రాజకీయ పరిణామాలపై కార్టూన్లు చూపించే ప్రభావం ఎంతో గొప్పదని అన్నారు. ప్రజల్లో ఆలోచన రేకెత్తించే శక్తి కార్టూన్లకు ఉందని చెప్పారు.

శేఖర్ సేవలు చిరస్మరణీయం
ప్రముఖ కార్టూనిస్టుల కృషిని గుర్తుచేసిన కేటీఆర్.. ఆర్.కే. లక్ష్మణ్ వంటి మహోన్నత కళాకారులు కార్టూన్ రంగానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారని అన్నారు. అంతర్జాతీయంగా Calvin and Hobbes తనకు ఎంతో ఇష్టమైన కార్టూన్ సిరీస్ అని పేర్కొన్నారు. తెలుగులో శ్రీధర్, శంకర్ వంటి కార్టూనిస్టుల ప్రతిభను ప్రశంసించారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు కార్టూనిస్టుగా శేఖర్ అందించిన సేవలు ప్రత్యేకమైనవని కేటీఆర్ అన్నారు. సమకాలీన అంశాలపై ఆయన గీసిన కార్టూన్లు ప్రజల్లో విశేష స్పందన పొందాయని చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కార్టూన్లు ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించాయని కొనియాడారు.

గాంధీ సిద్ధాంతాల అవసరం పెరిగింది

ప్రస్తుత పరిస్థితుల్లో మహాత్మా గాంధీ చూపిన విలువలు, సిద్ధాంతాల అవసరం మరింత పెరిగిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మత విశ్వాసాలు వ్యక్తిగతమైనవని, పరస్పర గౌరవంతో ముందుకు సాగడం సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. జీవితంలో గెలుపు, ఓటములు సహజమని పేర్కొన్న ఆయన.. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు మేలు చేయడమే ప్రజాప్రతినిధుల ప్రధాన కర్తవ్యమని అన్నారు.

వచ్చే ఏడాది నుంచి మరింత ఘనంగా అవార్డులు
కళను ప్రోత్సహించేందుకు ఇలాంటి అవార్డులు ఎంతో అవసరమని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతిభావంతులైన యువ కళాకారులను గుర్తించి ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని అన్నారు. శేఖర్ కుటుంబ సభ్యులు, మిత్రులు గత ఆరేళ్లుగా ఆయన స్మారకార్థం అవార్డులను నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి శేఖర్ మెమోరియల్ అవార్డులను మరింత వైభవంగా నిర్వహించేందుకు తన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రెస్ క్లబ్‌కు బదులుగా రవీంద్రభారతిలో కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిర్వహించేలా సహకరిస్తానని తెలిపారు.

శేఖర్ జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న కేటీఆర్
శేఖర్‌ను వ్యక్తిగతంగా కలిసే అవకాశం రాలేదని చెప్పిన కేటీఆర్.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లోనూ తెలంగాణ బిల్లు ఆమోదమైన రోజున గన్‌పార్క్‌కు వెళ్లి తెలంగాణ సాధనను చూసి ఆనందించిన ఘటన తనను ఎంతో కదిలించిందని గుర్తుచేసుకున్నారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందే శేఖర్ మరణించడం బాధాకరమని అన్నారు. ఆయన ప్రస్థానం నేటి తరం కార్టూనిస్టులకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.