మహిళల్లో సహనం నశిస్తోందా? మారుతున్న కుటుంబ సంబంధాలపై ఆందోళన

మహిళల్లో సహనం నశిస్తోందా? మారుతున్న కుటుంబ సంబంధాలపై ఆందోళన

కుటుంబ హింస, ఆర్థిక సమస్యల ప్రభావం

మద్యం, అనుమానాలు, దాంపత్య విభేదాల పెరుగుదల

మహిళల ఆర్థిక స్వాతంత్య్రం.. మారుతున్న సామాజిక పరిస్థితులు

కాలం మారింది. భర్తలు గృహహింసకు పాల్పడటం, భర్తల చేతుల్లో భార్యలు బలి కావడం అనే వార్తలు ఇప్పుడు తిరగబడుతున్నాయి. మహిళల్లో చైతన్యం పెరిగింది. ఇందుకు కారణం సామాజిక, ఆర్థిక పరిస్థితులే. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 554 మంది పురుషులు తమ భార్యల చేతుల్లో హతమయ్యారని ఏకం న్యాయ ఫౌండేషన్ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. మహిళల్లో సహనం ఎక్కువ, క్షమయా ధరిత్రీ అనేవి పాత మాటలు. ఇప్పుడు మహిళల్లో సహనం నశిస్తోంది. ఇందుకు అనేక కారణాలు. సామాజిక పరిస్థితులు, పరిసరాలు, చలన చిత్రాల ప్రభావం మొదలైనవి ఉన్నాయి. అయితే, వీటిల్లో మహిళలపై అత్యాచారాల కేసులు కూడా ఉన్నాయి. మహిళలపై దాడుల విషయంలో ఆర్థికమైనవే ఎక్కువ. అనుమానాలు, అక్రమ సంబంధాలు కూడా చేరి ఉన్నాయి. అన్నింటికీ మూలం ఆర్థిక సమస్యలే అధికం.

తాగుడు సమాజాన్ని ఎంతగా కృశింపజేస్తున్నదో మన నిత్యం సినిమాల్లో, సీరియల్స్, వివిధ ప్రాంతాల్లో జరిగే సంఘటనల్లో చూస్తూనే ఉన్నాం. కుటుంబాలను పోషించే బాధ్యత స్త్రీ, పురుషుల్లో సమానంగా ఉంటుంది. అయితే, తాగుడు వల్ల ఎక్కువమంది భర్తలు కుటుంబ పోషణను భార్యలకే అప్పజెప్పుతున్నారు. ఇంటి ఖర్చుల నిమిత్తం అయ్యే సొమ్మును పూర్తిగా ఇవ్వకుండా భార్యలను వేధిస్తున్నారు. ఇది సాధారణంగా చాలా చోట్ల కనిపించే దృశ్యం. సినిమాల్లో, సీరియల్స్లో ఇలాంటి దృశ్యాలు అయితే సర్వసాధారణం.

తాగుడు సమాజానికి ఎంత హాని చేస్తోందో తెలుసున్నా ప్రభుత్వాలు, ముఖ్యంగా పాలకులు దాన్ని నిషేధించేందుకు కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నికల ప్రచారంలో మద్య నిషేధం గురించి ఆకాశమంత ఎత్తున వాగ్దానాలు చేసే రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి నికరంగా ఆదాయం వస్తోంది. పన్నుల ఎగవేతను అరికట్టే శక్తి ఏ పార్టీకీ ఉన్నట్టు కనిపించడం లేదు. అన్ని పార్టీల్లో ఎగవేతదారులు ఉన్నారు. అలాగే, ఎగవేతదారులకు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రక్షణ లభిస్తోంది. అందువల్ల మద్యం విక్రయాలను రాజకీయపార్టీలు నిషేధించలేక పోతున్నాయి.

ఈ నేపథ్యంలో మహిళలలో తిరగబడే మనస్తత్వం పెరుగుతోంది. మహిళలు అబలలు కారు, సబలలు అని రుజువు చేస్తున్నారు. దానికి తోడు ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఆర్థిక స్వాతంత్య్రం ద్వారా వారిలో తిరగబడే తత్వం పెరుగుతోంది. స్త్రీ, పురుష సమానత్వంపై రాజకీయ నాయకుల ప్రసంగాలు వారిని ప్రభావితం చేస్తున్నాయి.

ఏ స్త్రీ కూడా తన పసుపు కుంకుమలను తనంతట తాను దూరం చేసుకోవాలని కోరుకోదు. ఇంట్లో పైసా ఇవ్వకపోయినా, పిల్లలతో పాటు భర్తలను పోషిస్తున్న వారెంతో మంది ఉన్నారు. ఉద్యోగాలు చేస్తున్న మహిళలను తమ రోజువారీ ఖర్చుల నిమిత్తం వేధించే భర్తలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిని దారికి తెచ్చుకునే సహనశీలురైన మహిళలు కూడా మన సమాజంలో ఉన్నారు. వారిలో సహనం నశించినప్పుడే హత్యల వరకూ పరిస్థితి వెళ్తుంది.

ఏకం న్యాయ ఫౌండేషన్ సంస్థ విడుదల చేసిన నివేదికలో భార్యలు, వారి ప్రేమికుల చేతుల్లో హతమైనవారే కాకుండా భర్త హింసను భరించలేక భర్తలను హత్యలు చేసిన మహిళలు కూడా ఉన్నారు. అయితే, పిల్లల కోసం సర్దుకుని పోతూ, రాక్షసుల వంటి భర్తలను భరిస్తున్న భార్యలు కూడా మన సమాజంలో ఉన్నారు. వారికి చేయూతనివ్వడం ప్రభుత్వం కర్తవ్యం.