దుర్గమ్మ సన్నిధిలో జనసంద్రం
- ఆషాఢ సారెతో ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
- ఆదివారం సెలవుతో కనకదుర్గమ్మ సన్నిధిలో అపార రద్దీ
- అంతరాలయ, వీఐపీ దర్శనాలకు తాత్కాలిక నిలుపుదల
- ముఖ మండపం ద్వారానే అందరికీ దర్శనం
- అన్ని క్యూలైన్లు ఉచితంగానే అమ్మవారి దర్శనం
- మధ్యాహ్నం 3 గంటలకే 50 వేల మంది దర్శనం
- భక్తులకు తాగునీరు, ప్రత్యేక ఏర్పాట్లతో రద్దీ నియంత్రణ
- ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్న చైర్మన్ బొర్రా గాంధీ
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ మాస మహోత్సవాల సందర్భంగా ఆదివారం భక్తజన సందోహం వెల్లువెత్తింది. ఆదివారం సెలవు దినం కావడం, ఆషాఢ సారె సమర్పించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, ఘాట్‌రోడ్డు, మహామండపం పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి.
తెల్లవారుజాము నుండే భక్తుల రద్దీ…
భక్తుల రద్దీ గంట గంటకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆలయ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. అంతరాలయ దర్శనాన్ని నిలిపివేసి, వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేసి, ప్రతి భక్తికి ముఖ మండపం ద్వారానే దర్శనం కల్పించారు. మధ్యాహ్నానికి రద్దీ మరింత పెరగడంతో అన్ని క్యూలైన్లను ఉచిత దర్శనానికి కేటాయించి భక్తుల రాకను క్రమబద్ధీకరించారు.

కిక్కిరిసిన క్యూ లైన్లు..
ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నాటికే సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం వరకు కూడా ఇదే స్థాయిలో రద్దీ కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆషాఢ సారె సమర్పించేందుకు వచ్చిన భక్తులు ముందుగా కృష్ణానదిలోని దుర్గా ఘాట్, భవానీ ఘాట్‌లలో పవిత్ర స్నానాలు ఆచరించి, క్యూలైన్ల ద్వారా కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో భక్తిశ్రద్ధలతో తీసుకువచ్చిన ఆషాఢ సారెను సమర్పిస్తున్నారు.
సిబ్బందికి ప్రత్యేక బాధ్యతలు..
భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానంలోని అన్ని విభాగాల సిబ్బందికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించి రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో క్యూలైన్లలో తాగునీటి ఏర్పాట్లు విస్తృతంగా చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దేవస్థానం చైర్మన్ బొర్రా గాంధీ ఆలయ పరిసరాల్లో విస్తృతంగా పర్యటిస్తూ భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు, సిబ్బందికి అవసరమైన సూచనలు చేస్తూ సేవలను మరింత మెరుగుపర్చాలని ఆదేశించారు.

