72th National Film Awards | కమిటీ కుర్రోళ్లకు జాతీయ అవార్డు…

  • టాలీవుడ్ ప్రతిభకు మరోసారి దేశవ్యాప్త గుర్తింపు
  • ఐదు విభాగాల్లో తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ అవార్డులు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారతీయ సినీ రంగంలో అత్యున్నత గౌరవంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు శనివారం ప్రకటించగా.. ఈసారి టాలీవుడ్ తన సత్తా చాటింది. కథా బలం, సాంకేతిక నైపుణ్యం, నిర్మాణ విలువలతో తెలుగు చిత్రాలు మరోసారి జాతీయ స్థాయిలో తమ ప్రత్యేకతను నిరూపించాయి. ముఖ్యంగా ‘కమిటీ కుర్రోళ్లు’ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ఇక‌ ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి సంభాషణల విభాగంలో జాతీయ అవార్డు రావడం, ‘పుష్ప: ది రూల్ పార్ట్-2’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు సాంకేతిక విభాగాల్లో జాతీయ పురస్కారాలు సాధించడం టాలీవుడ్‌కు గర్వకారణంగా నిలిచింది.

2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) నుంచి సెన్సార్ సర్టిఫికెట్ పొందిన చిత్రాలను పరిశీలించిన జ్యూరీ విజేతలను ఎంపిక చేసింది. ప్రముఖ దర్శకుడు జయరాజ్ నేతృత్వంలోని 11 మంది సభ్యుల కమిటీ అవార్డులను ప్రకటించింది.

‘కమిటీ కుర్రోళ్లు’కు జాతీయ స్థాయిలో గుర్తింపు

తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం, ఉత్తమ తెలుగు చిత్రంగా ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంది. యదు వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, గ్రామీణ నేపథ్యంలో యువత జీవితాలు, స్నేహబంధాలు, భావోద్వేగాలను ఎంతో సహజంగా ఆవిష్కరించింది. తక్కువ బడ్జెట్‌తో విడుదలైనప్పటికీ, విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా ఇప్పుడు జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది.

మరొక విశేషం ఏమిటంటే, ఇదే చిత్రానికి గాను పి.రవి కుమార్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్‌గా జాతీయ అవార్డును అందుకున్నారు. దీంతో ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.

‘లక్కీ భాస్కర్’కు మరో అరుదైన గౌరవం

దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి గాను, ఉత్తమ సంభాషణల విభాగంలో దర్శకుడు వెంకీ అట్లూరి జాతీయ అవార్డును అందుకున్నారు. సమాజంలోని ఆర్థిక పరిస్థితులను, మధ్యతరగతి కుటుంబాల భావోద్వేగాలను సమర్థవంతంగా ఆవిష్కరించిన ఆయన అద్భుతమైన రచనకు ఈ గుర్తింపు లభించింది.

‘పుష్ప-2’, ‘కల్కి’ సాంకేతిక విభాగాల్లో మెరుపులు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రూల్ పార్ట్-2’ చిత్రానికి దీపాలి నూర్, శీతల్ శర్మలకు ఉత్తమ వస్త్రాల రూపకల్పన (కాస్ట్యూమ్ డిజైన్) విభాగంలో జాతీయ పురస్కారం లభించింది. సినిమాలోని పాత్రలకు తగ్గట్టు రూపొందించిన దుస్తులు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి.

ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ విజువల్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’కి నితిన్ జిహానీ చౌదరి ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డును గెలుచుకున్నారు. భవిష్యత్ ప్రపంచాన్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన సెట్ డిజైన్‌కు ఈ జాతీయ గుర్తింపు లభించింది.

టాలీవుడ్‌కు ఐదు జాతీయ అవార్డులు

ఈసారి తెలుగు సినీ పరిశ్రమకు మొత్తం ఐదు జాతీయ పురస్కారాలు రావడం విశేషం.

  • ఉత్తమ తెలుగు చిత్రం – కమిటీ కుర్రోళ్లు
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే (సంభాషణలు) – వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
  • ఉత్తమ మేకప్ ఆర్టిస్టు – పి. రవి కుమార్ (కమిటీ కుర్రోళ్లు)
  • ఉత్తమ వస్త్రాల రూపకల్పన – పుష్ప: ది రూల్ పార్ట్-2
  • ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – కల్కి 2898 ఏడీ

జాతీయ అవార్డుల్లో ఇతర ప్రధాన విజేతలు

ఈ ఏడాది ఉత్తమ నటుడి పురస్కారాన్ని మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టి, బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా అందుకున్నారు. ఉత్తమ నటిగా యామి గౌతమ్ ఎంపికయ్యారు.

సాంకేతిక విభాగాల్లో ‘మహారాజా’ చిత్రానికి అనల్ అరసు ఉత్తమ యాక్షన్ డైరెక్టర్‌గా నిలవగా, ‘అమరన్’ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీత దర్శకుడిగా, ‘ఆర్టికల్ 370’ చిత్రానికి శశ్వత్ సచ్‌దేవ్ సంగీత విభాగంలో జాతీయ అవార్డులు అందుకున్నారు.

ప్రాంతీయ చిత్రాల్లో విజేతలు

ప్రాంతీయ భాషల విభాగంలో తెలుగులో ‘కమిటీ కుర్రోళ్లు’, తమిళంలో ‘రాయన్’, హిందీలో ‘శ్రీకాంత్’, మలయాళంలో ‘ఫెమినిచి ఫాతిమా’, కన్నడలో ‘మిథ్యా’ ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయి.

దేశవ్యాప్తంగా 24 భాషల్లో రూపొందిన 161 చిత్రాలు ఈసారి జాతీయ చలనచిత్ర పురస్కారాల కోసం పోటీ పడగా, తెలుగు సినిమాలు ఐదు విభాగాల్లో అవార్డులు సాధించి మరోసారి తమ సృజనాత్మకత, సాంకేతిక ప్రతిభను దేశానికి చాటిచెప్పాయి. చిన్న సినిమాల నుంచి భారీ పాన్ ఇండియా చిత్రాల వరకు టాలీవుడ్ అన్ని స్థాయిల్లో తన ముద్ర వేసిందని ఈ పురస్కారాలు మరోసారి నిరూపించాయి.