ఎల్‌నినో ని ఎదుర్కొనేందుకు నిపుణుల కమిటీ..
- చైర్మన్‌గా మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి నియామకం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా తలెత్తే కరవు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, ముందస్తు నివారణ చర్యలను సూచించేందుకు రాష్ట్రస్థాయి ఉన్నత నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కమిటీకి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి చైర్మన్‌గా నియమితులయ్యారు. వ్యవసాయ రంగంపై ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బాధ్యతలు అప్పగించినట్లు ప్రభుత్వం తెలిపింది. కమిటీ కన్వీనర్‌గా వ్యవసాయ శాఖ డైరెక్టర్ వ్యవహరించనున్నారు.
ఈ నిపుణుల కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం, వర్షపాత లోటు, భూగర్భ జలాల క్షీణత, వ్యవసాయంపై పడుతున్న ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందించనుంది. అలాగే భవిష్యత్తులో కరవు పరిస్థితులు ఏర్పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, తాగునీరు, సాగునీటి నిర్వహణకు అవసరమైన సూచనలను ప్రభుత్వానికి అందజేయనుంది.
అదనంగా, తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను రైతులకు ప్రోత్సహించే చర్యలు, పంట నష్టాన్ని తగ్గించే విపత్తు నిర్వహణ ప్రణాళికల రూపకల్పనపై కూడా కమిటీ దృష్టి సారించనుంది. కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే కార్యాచరణ ప్రణాళికను మరింత పటిష్ఠంగా అమలు చేయడంతో పాటు రైతులకు అవసరమైన సహాయక చర్యలను చేపట్టనుంది.
