హైదరాబాద్ తాగునీటికి ఇబ్బంది లేదు..

  • వర్షపు నీటి సంరక్షణ ఇక జాతీయ అవసరం..
  • అన్ని శాఖలతో సమన్వయ చర్యలు
  • భూగర్భ జలాల క్షీణతే ప్రధాన ఆందోళన : ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉన్న ‘సూపర్ ఎల్‌నినో’ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు, నీటి వనరుల వినియోగంలో నెలకొంటున్న అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని చెప్పారు.

శనివారం వాతావరణ మార్పులపై ‘సింపోజియం’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ ఇప్పటికే వాతావరణ మార్పుల ప్రభావాన్ని అనుభవిస్తోందని, ఇకపై గత వర్షపాతం గణాంకాల ఆధారంగా మాత్రమే నీటి ప్రణాళికలు రూపొందించే పరిస్థితి లేదని హెచ్చరించారు.

హైదరాబాద్‌కు తాగునీటి భద్రత

హైదరాబాద్ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాల్లో ఒకటిగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి దశాబ్దాలుగా చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా నగరానికి తాగునీటి సరఫరా భద్రంగా ఉందని తెలిపారు. నగర జనాభా, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పెరిగినా తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ట్రాఫిక్ సమస్యలను మెట్రో రైలు విస్తరణతో పాటు ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టుల ద్వారా పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.

అయితే భూగర్భ జలాల మట్టం గణనీయంగా పడిపోవడం ఆందోళన కలిగించే అంశమని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో 50 నుంచి 100 అడుగుల లోతులో లభించిన భూగర్భ జలాలు ప్రస్తుతం హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో వెయ్యి అడుగుల లోతుకు చేరుకున్నాయని తెలిపారు. ఇది అత్యంత తీవ్రమైన పరిస్థితి అని వ్యాఖ్యానించారు.

భూగర్భ జలాలను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాలను ప్రోత్సహిస్తోందని మంత్రి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో అధిక కాంక్రీటీకరణ వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం తగ్గిపోయిందని, అందువల్ల రైన్‌వాటర్ హార్వెస్టింగ్‌ను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అన్ని శాఖలతో సమన్వయ చర్యలు

ఎల్‌నినో ప్రభావం మరింత తీవ్రం కాకముందే ప్రభుత్వం అప్రమత్తమైందని మంత్రి తెలిపారు. నీటిపారుదల, వ్యవసాయం, తాగునీటి సరఫరా, పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నాయని, రైతులు, ప్రజలపై వర్షాభావ ప్రభావం తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.