ఎల్‌నినో ప్రభావ తీవ్రత తగ్గించేలా ప్రత్యేక కార్యాచరణ
ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో వర్షాభావ పరిస్థితులను వివరించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : కరీంనగర్ కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను కలెక్టర్ కోయ శ్రీహర్ష మంత్రులకు వివరించారు. జిల్లాలో సాగు పరిస్థితులు, సాగునీటి లభ్యత, రానున్న రోజుల్లో సాగు విస్తీర్ణంపై అంచనాలు తదితర అంశాలను ఇన్‌చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే ఆరుతడి పంటల సాగు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం చేపడుతున్న ప్రత్యేక కార్యాచరణ, ప్రత్యామ్నాయ చర్యలను మంత్రులకు వివరించారు.
