గిరిజన విద్యాభివృద్ధికి మరో ముందడుగు

అశ్వాపురం, (ఆంధ్రప్రభ): గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించే దిశగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామంలోని బాలుర ఆశ్రమ పాఠశాలలో రూ.2.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల భవనాలకు రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారం భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో అవసరమైన అన్ని వసతులను దశలవారీగా ఏర్పాటు చేసి విద్యార్థులు ఉత్తమ విద్యను అభ్యసించే వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు.

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పినపాక నియోజకవర్గంలో విద్యా రంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ అదనపు తరగతి గదుల నిర్మాణంతో విద్యార్థులకు మరింత మెరుగైన విద్యా వాతావరణం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.