వర్షం కోసం మహానందికి రైతుల పాదయాత్ర
తుగ్గలి, (ఆంధ్రప్రభ): వర్షాలు కురిసి పంటలు పండాలని ఆకాంక్షిస్తూ తుగ్గలి మండలం కడమకుంట్ల గ్రామ రైతులు మహానంది క్షేత్రానికి భజనలతో కాలినడకన పాదయాత్ర చేపట్టారు. గ్రామంలో సరిపడా వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో దేవుడే దిక్కనే విశ్వాసంతో చేతిలో తాళాలు, నోట శివనామస్మరణతో భక్తి యాత్ర ప్రారంభించారు. దారిపొడవునా సప్త భజనలు చేస్తూ సాగిన రైతుల యాత్ర స్థానికులను ఆకట్టుకుంది.
మహానంది క్షేత్రంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, కోనేరులోని పవిత్ర జలాలను గ్రామానికి తీసుకొచ్చి స్థానిక దేవాలయాల్లో అభిషేకాలు నిర్వహిస్తామని రైతులు తెలిపారు. గ్రామంపై వరుణదేవుడి కరుణ కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు.
వర్షాల కోసం రైతులు చేపట్టిన ఈ భక్తి పాదయాత్ర ప్రకృతిపై వ్యవసాయం ఎంతగా ఆధారపడిందో, అన్నదాతల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. వర్షాలు కురిసి రైతుల కష్టాలు తీరాలని గ్రామస్తులు కూడా ఆకాంక్షించారు.
