Cyclone Ditva |దిత్వా తుఫాన్ నేపథ్యంలో..
- అధికారులు అప్రమత్తంగా ఉండాలి
- జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
Cyclone Ditva | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: నవంబర్ 30, డిసెంబర్ 1వ తేదీలలో జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, గాలులు తలెత్తే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జిల్లా ప్రజలు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం తుఫాన్ పై ఓ ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 30, డిసెంబర్ 1వ తేదీన జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించారు. తుఫాన్ కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు సిద్దంగా ఉంచాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే తాత్కాలిక పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి తాగునీరు, ఆహారం, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. గ్రామాల్లో పోలీసులు, రెవెన్యూ, కలిసి విస్తృత ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. అలాగే, జలపాతాలు, వాగులు, కాలువలు, ప్రమాదకర పర్యాటక ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
విద్యుత్ శాఖ అవసరమైన స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు, జనరేటర్లను ముందుగానే సిద్ధంగా ఉంచాలని, విద్యుత్ అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ప్రత్యేక బృందాలు పనిచేయాలని సూచించారు. వ్యవసాయ, పశుసంవర్ధక, పంచాయతీ రాజ్, మున్సిపల్, శాఖలతో పాటు అన్ని లైన్ డిపార్ట్మెంట్లు 24/7 అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుపాన్ సమయంలో వైద్య శాఖ అత్యవసర వైద్య సిబ్బంది, అంబులెన్స్లు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంచాలని, పశువుల కోసం కూడా తగిన వైద్య సాయం అందుబాటులో ఉండాలని అన్నారు.
లోతట్టు ప్రాంతాల్లో వరద పరిస్థితులు తలెత్తే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు జిల్లా కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ కోరారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకి 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైనవీదురు గాలులు వీస్తాయని తెలిపారు.

