వేద విద్యార్థుల మృతి అత్యంత బాధాకరం…
నరసరావుపేట (ఆంధ్రప్రభ) : అమరావతి మండలం యండ్రాయి గ్రామంలోని వేద పాఠశాలలో ఆవును కాపాడే ప్రయత్నంలో చెరువులో మునిగి ఇద్దరు వేద విద్యార్థులు బమిడి శివనాగ సుబ్రహ్మణ్య మణిశర్మ (17), కొడవటికంటి కిరణ్ (18) మృతి చెందడం అత్యంత విషాదకరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తోటి విద్యార్థితో కలిసి చెరువులోకి వెళ్లిన ఆవును కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రయత్నించడం వారి మానవత్వానికి నిదర్శనమని అన్నారు. అయితే ఆ ప్రయత్నమే వారి ప్రాణాలను బలిగొనడం హృదయ విదారకమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులకు కొమ్మాలపాటి శ్రీధర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థించారు. చికిత్స పొందుతున్న విద్యార్థి కాళేశ్వర సుప్రదీప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా విద్యాసంస్థలు, గోశాలలు, చెరువుల పరిసర ప్రాంతాల్లో తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు.
